బర్త్‌డేలు పోతున్నాయ్ వస్తున్నాయ్..ఇంకా క్లారిటీ రాదే హరి హరా?
నిర్మాత, డైరెక్టర్, ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంది. అదే 'హరి హర వీరమల్లు'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇందులో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 Sep 2023 5:30 PM GMTకోవిడ్‌కు ముందు మొదలు పెట్టిన సినిమాల్లో దాదాపు థియేటర్లలోకి వచ్చేశాయి. ఒకటి అర మాత్రం ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. అంతే కాకుండా కోవిడ్ తరువాత సెట్స్ పైకి వెళ్లిన సినిమాలు కూడా షూటింగ్‌లు పూర్తి చేసుకోవడమే కాకుండా థియేటర్లోకి వచ్చేసిన రీల్ డబ్బాలు కూడా తిరిగి వచ్చేశాయి కూడా. కానీ ఒకే ఒక్క సినిమా మాత్రం ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. నిర్మాత, డైరెక్టర్, ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంది. అదే 'హరి హర వీరమల్లు'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇందులో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
మెగా హీరో చెయ్యక చెయ్యక పాన్ ఇండియా సినిమా..అందులోనూ జానపద నేపథ్యంలో సాగే పీరియడిక్ ఫిక్షనల్ డ్రామా చేస్తున్నాడని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే ప్రభాస్ మాత్రమే 'బాహుబలి' లాంటి సినిమా చేస్తాడా? పవన్ కూడా చేస్తాడు..చేయగలడని అభిమానులు రొమ్మువిరిచి జబ్బ జరిచి చెప్పుకున్నారు. సినిమా మొదలైంది. కోవిడ్ విలయ తాండవం చేసింది. కట్ చేస్తే సినిమాకు బ్రేక్ పడింది.
భారీ బడ్జెట్ సినిమా అని సంబరపడిన అభిమానుల ఆనందం అంతా ఆవిరైపోయింది. మళ్లీ సినిమా మొదలు పెట్టారు. 2022, ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నాం అంటూ పవన్ పుట్టిన రోజైన 2021, సెప్టెంబర్ 2న మేకర్స్ ప్రకటించారు. దీంతో మళ్లీ పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక థియేటర్లలోకి రావడమే ఆలస్యం అనేంతగా హంగామా చేశారు. కట్ చేస్తే సినిమా మళ్లీ ఆగిపోయింది. అభిమానులు, నిర్మాత ఏ.ఎం.రత్నం, దర్శకుడు క్రిష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టిన పవన్ మిగతా సినిమాలని పూర్తి చేయడం మొదలు పెట్టాడు.
ఇదిలా ఉంటే పవన్ మరో బర్త్‌డే 2022, సెప్టెంబర్ 2 మళ్లీ వచ్చింది. ఆ రోజు మేకర్స్ ఓ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఫ్యాన్స్ అదరిందహో అంటూ జబ్బలు చరుచుకున్నారు. ఇక థియేటర్లు మోత మోగిపోవడం ఖాయం అని సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. సీన్ మళ్లీ మొదటికి వచ్చింది. రెండు బర్త్‌డేలు వచ్చాయి..పోయాయి. ఇప్పుడు మూడవ బర్త్‌డే వంతు.. ఈ సందర్భంగా నిర్మాత ఏ.ఎం.రత్నం కొత్త పోస్టర్‌ని అర్థ్రరాత్రి రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించాడు.
ఈ వార్త విని ఫ్యాన్స్ సంబరపడలేదు. సంబరాలు చేసుకోలేదు. నిర్మాతపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. 'హరి హర వీరమల్లు' పరిస్థితి ఎలా తయారైందంటే చిన్నప్పుడు విన్న నాన్నా పులి కథలా ఉంది. మూడేళ్లుగా మూడు బర్త్‌డేలు వచ్చి వెళ్లిపోతున్నా 'హరి హర'పై మేకర్స్‌తో పాటు డైరెక్టర్‌కు కూడా క్లారిటీ లేకపోవడంతో అభిమానుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పటికి తేలేనో పవన్‌కైనా క్లారిటీ ఉందా? అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయని ఇన్ సైడ్ టాక్.