షోలే దర్శకుడితో గబ్బర్‌సింగ్ దర్శకుడి ఫ్యాన్‌బాయ్ మూమెంట్
షోలే సినిమా దర్శకుడు రమేష్ సిప్పీతో కలిసి ఫోటో దిగే అవకాశం రావడంతో హరీష్ శంకర్ ఆనందం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 2 Dec 2024 6:51 AM GMTఇండియన్ సినిమా చరిత్ర ఉన్నంత కాలం షోలే సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ సినిమా గురించి ప్రస్థావన లేకుండా ఇండియన్ సినిమా ఉండదు అనడంలో సందేహం లేదు. దాదాపు 50 ఏళ్ల క్రితం వచ్చిన షోలే సినిమా ఎంతో మంది దర్శకులను ఏకలవ్య శిష్యులుగా సొంతం చేసుకుంది. ఆ సినిమా కథ నుంచి ఎన్నో వందల కథలు పుట్టాయి, ఆ సినిమాలోని సన్నివేశాల నుంచి ఎన్నో వేల సీన్స్ వచ్చాయి. కొన్ని అచ్చు అలాగే పేరడీగా వస్తే, కొన్ని మార్చి రాయడం జరిగింది. మొత్తానికి షోలే సినిమా ఇండియన్ సినిమా మొత్తానికి చాలా చాలా స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాంటి షోలే సినిమాను రూపొందించిన దర్శకుడు రమేష్ సిప్పీ అంటే ఎంతో మందికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఆయన వర్కింగ్ స్టైల్‌కి ఫిదా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. రమేష్ సిప్పీని అత్యధికంగా అభిమానించే వారిలో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్ ఒకరు అని చెప్పుకోవచ్చు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సీన్‌లో షోలే తాలూకు మార్క్ ఉంటుందని ఆయనే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. షోలే సినిమాను ఎన్నో సార్లు చూసిన హరీష్ శంకర్ ఆ సినిమాలోని కీలక పాత్ర అయిన గబ్బర్ సింగ్ ను తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు. గబ్బర్ సింగ్ మొదలుకుని ఎన్నో సినిమాలు ఆయన షోలే నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని చేయడం జరిగింది.
షోలే సినిమా దర్శకుడు రమేష్ సిప్పీతో కలిసి ఫోటో దిగే అవకాశం రావడంతో హరీష్ శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. తన ఫేవేట్ మూవీ దర్శకుడు అయిన రమేష్ సిప్పీని కలవడంతో డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయ్యింది అన్నట్లుగా హరీష్ శంకర్ తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారు. ఈమధ్య కాలంలో హరీష్ శంకర్ గ్రాఫ్ కాస్త డౌన్ ఫాల్ అవుతోంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో కొత్త సినిమా కోసం హీరోను వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్‌ను తీసిన దర్శకుడు హరీష్ శంకర్ చాలా కాలం తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను మొదలు పెట్టడం జరిగింది. కానీ పవన్ రాజకీయాలతో అప్పుడు బిజీగా ఉండటం, ఇప్పుడు పరిపాలనతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా షూటింగ్ జరిగే పరిస్థితి లేదు. కేవలం మూడు నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే పవన్ చేయడం జరిగింది, కనుక మొత్తానికే సినిమాను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. పవన్ ఇప్పటికే సగానికి పైగా షూట్ చేసిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను ముగించి వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.