గౌరవాన్ని కాపాడుకోండి.. లేదంటే!: హరీష్ వార్నింగ్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి చోటా కె నాయుడు ప్రస్తావించారు.
By: Tupaki Desk | 20 April 2024 1:20 PM GMTటాలీవుడ్ సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు గురించి అందరికీ తెలిసిందే. తరచూ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఆ సమయంలో తాను చేసిన సినిమాలతో పాటు పలువురు హీరోల గురించి మాట్లాడుతుంటారు. కొన్ని అనుభవాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి చోటా కె నాయుడు ప్రస్తావించారు.
రామయ్యా వస్తావయ్యా సినిమా టైమ్ లో తన వర్క్ లో హరీష్ శంకర్ ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు చోటా. తనను ఒప్పించడానికి చాలా ప్రయత్నించినట్లు చెప్పారు. చివరకు చేసేదేమి లేక హరీష్ కు ఎలా కావాలో అలాగే వర్క్ చేశానంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారగా హరీష్ శంకర్ స్పందించారు. బహిరంగ లేఖ రాసి కాస్త ఘాటుగానే బదులిచ్చారు. తనను అవమానించడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.
హరీష్ శంకర్ రాసిన లేఖ ప్రకారం.. "గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ... రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్ తో షూటింగ్ చేద్దామన్న ప్రస్తావన వచ్చింది."
"కానీ రాజుగారు చెప్పడం మూలంగానో ‘గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడు.. అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే "గబ్బర్ సింగ్" వచ్చినప్పుడు నాది "రామయ్యా వస్తావయ్యా" వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు."
"ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే any day any platform IAM Waiting - భవదీయుడు హరీష్ శంకర్" అని తన ఎక్స్ (అప్పటి ట్విట్టర్)లో లెటర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.