Begin typing your search above and press return to search.

బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం.. హర్ష సాయి విచిత్ర వాదన

ఐతే ఈ విషయమై మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు హర్ష సాయి. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసే విషయమై అతను ఇచ్చిన వివరణ విడ్డూరంగా ఉంది.

By:  Tupaki Desk   |   18 July 2024 3:15 AM GMT
బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం.. హర్ష సాయి విచిత్ర వాదన
X

ఇప్పుడు సెలబ్రెటీలతో పాటు సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు చాలామంది బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయడం మామూలైపోయింది. కానీ ఈ ప్రచారం చూసి బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెడుతున్న యువత సర్వనాశనం అయిపోతున్నారనే విమర్శలున్నాయి. ఈ వలలో చిక్కుకుని లక్షలు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్న కుర్రకారు గురించి వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి.

అందుకే బెట్టింగ్ యాప్స్‌కు సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రచారం ఆపాలనే వాదన బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయి లాంటి వాళ్లు ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయడం పట్ల కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఐతే ఈ విషయమై మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు హర్ష సాయి. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసే విషయమై అతను ఇచ్చిన వివరణ విడ్డూరంగా ఉంది. ఇంతకీ అతనేమన్నాడో చూద్దాం.

"మేం బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసినా సరే.. జాగ్రత్త అన్నది ముఖ్యం.. బాధ్యత అన్నది ముఖ్యం అని చెబుతాం. మేం ఒక వేళ ఇలాంటి ప్రమోషన్ చేయలేదు అనుకుందాం. మాకు కేటాయించే బడ్జెట్ ఏదైతో ఉందో అది ఇంకో పది మంది క్రియేటర్స్‌కు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్లు మాలా చేయరు. జాగ్రత్త అని చెప్పరు. వాళ్లకొక స్క్రిప్ట్ ఇస్తారు. ఇలాగే చెప్పండి అని. మేం ఇళ్లు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం అని చెబుతారు. మాలా జాగ్రత్త అని చెప్పరు. మేం చాలా బాధ్యతగా చేస్తాం. ఈ పది మంది చేయడం వల్ల ఆడేవాళ్ల సంఖ్య దారుణంగా పెరుగుతుంది.

మేం చేయడం వల్ల ఆ సంఖ్యను తగ్గించగలిగాం. పైగా దాన్నుంచి వచ్చిన డబ్బులు నాలుగు మంచి పనులు చేయడానికి ఉపయోగించాం. మేం ఇలాంటివి ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసిన వాళ్లవుతాం. మిస్ యూస్ చేసేవాళ్ల చేతులకు వెళ్తుంది" అని చెప్పాడు హర్ష సాయి. అంతే కాక తాము ఏది నిషేధంలో ఉందో చూసుకునే ప్రమోట్ చేస్తామని.. ధోని సహా చాలామంది బ్యాన్డ్ ప్రాడక్ట్స్‌కు ప్రచారం చేస్తారని.. ఐతే ఎవ్వరూ కూడా జనాలకు చెడు చేయాలని చేయరు అంటూ హర్ష సాయి సమర్థించుకోవడం గమనార్హం.