స్టేజ్‌పై పిలవలేదని అలిగాను.. ఇప్పటికీ మరిచోలేను: హర్షవర్ధన్
అది కేవలం ఓ స్టేజ్ కార్యక్రమమే అయినా, తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు.
By: Tupaki Desk | 24 March 2025 10:23 PM ISTటాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, కామెడీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్షవర్ధన్, తాజాగా ఓ ఎమోషనల్ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. "గుండెజారి గల్లంతయ్యిందే" సినిమా ఈవెంట్ సందర్భంగా జరిగిన ఓ అనుభవం, తన మనసులో ఇప్పటికీ మిగిలిపోయిందని హర్షవర్ధన్ చెప్పాడు. రీసెంట్‌గా కోర్ట్ సినిమాలో న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందిన ఆయన, ఈ సంఘటనను చాలా ఓపికగా వివరించాడు. అది కేవలం ఓ స్టేజ్ కార్యక్రమమే అయినా, తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు.
అదే ఈవెంట్‌లో యాంకర్ హర్షవర్ధన్ అని పేరు పిలిచిందని, అది తననే అనే పొరపాటుతో లేచి స్టేజ్ పైకి వెళ్లబోతే, బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణే స్టేజ్ పైకి వెళ్లారని తెలిపారు. అంతే కాకుండా, తాను కూర్చున్నపుడు పక్కనే ఉన్నవారు ‘రైటర్ అయి నిన్ను పిలవలేదేంటి?’ అని అడిగినప్పుడు మరింత బాధపడ్డానని చెప్పారు. చివరికి నన్ను పిలుస్తారేమోనన్న ఆశతో చివరిదాకా కూర్చున్నాననీ, చివరికి స్టేజీ పైకి ఎక్కించలేదనే బాధతో నిస్సత్తువై కూర్చున్నానన్నారు.
ఇవన్నీ జరగగా, సినిమా షూటింగ్‌లో చివరికి మిగిలిన ఒక్క సీన్ కోసం పిలిచినప్పుడు, మొదట తాను తిరస్కరించానని చెప్పారు హర్షవర్ధన్. నితిన్ స్వయంగా ఫోన్ చేసి రమ్మని అడిగినప్పటికీ, తాను ఓదార్పు ఆశించి వెళ్లానని తెలిపారు. నితిన్ తనకు సారీ చెబుతాడని అనుకున్నానని, కానీ ఆయన ఫ్రాంక్‌గా సమస్యేంటని అడిగారని పేర్కొన్నారు. ఆ సమయంలో తన బాధను వివరించినప్పటికీ, నితిన్ తనపై కోపంగా స్పందించి, ఇది నీ సినిమా కాదా? నువ్వే ఎందుకు స్టేజీపైకి ఎక్కలేవు? అని క్లాస్ తీసుకున్నాడని చెప్పుకొచ్చారు.
అక్కడే నితిన్ తనలోని నిజాయితీని బయటపెట్టాడని, ఒక నటుడిగా, భాగస్వామిగా తన బాధ్యత ఏమిటో అర్థం చేసుకునేలా తనకు చక్కగా బోధించాడని అన్నారు. నితిన్ మాటల వల్ల తనలోని ఆత్మబోదం కలిగిందని, నిజంగా తాను తప్పు చేశానని అర్థమైందని చెప్పారు. అందరిని గుర్తుపెట్టుకుని మాట్లాడటం ఎంత కష్టమో రేపు పొద్దున నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు తెలుస్తుందని చెప్పాడు. ఇక స్టేజీపై ఉన్న ప్రతీ ఒక్కరినీ గుర్తుపెట్టి మాట్లాడటం ఎంత కష్టమో తనకిప్పుడు తెలుస్తుందని, యాంకర్లు ఎంత ఒత్తిడిలో ఉంటారో కూడా అర్థమైందన్నారు.
ఆ సంఘటన తర్వాత తాను నితిన్‌కి సారీ చెప్పాలని అనిపించిందని, కానీ అప్పటికే పరిస్థితి దాటి పోయిందని హర్షవర్ధన్ చెప్పారు. ఇప్పటికీ ఆ సంఘటనను తాను మరిచిపోలేనని, అయితే నితిన్ మాత్రం ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చని భావించానన్నారు. ఈ సంఘటన తనను ఎంతో మానసికంగా ఎదిగేలా చేసిందని హర్షవర్ధన్ పేర్కొన్నారు. అప్పటి చిన్న మిసండర్స్టాండింగ్ తాను పెద్దగా తీసుకున్నానని ఇప్పుడు గ్రహించానని చెప్పారు.