Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : హత్య

హత్య. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

By:  Tupaki Desk   |   21 July 2023 11:38 AM GMT
మూవీ రివ్యూ : హత్య
X

'హత్య' మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్ ఆంటోనీ-మీనాక్షి చౌదరి-రితికా సింగ్-రాధికా శరత్ కుమార్-మురళీ శర్మ తదితరులు

సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్

ఛాయాగ్రహణం: శివకుమార్ విజయన్

నిర్మాణం: ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్-లోటస్ పిక్చర్స్

రచన- దర్శకత్వం: బాలాజి.కె.కుమార్


'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుని.. ఆ తర్వాత బాగా డౌన్ విజయ్ ఆంటోనీ.. ఈ మధ్యే 'బిచ్చగాడు-2'తో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత అతడి నుంచి వచ్చిన కొత్త చిత్రం.. హత్య. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

సింగర్ కమ్ మోడల్ అయిన లైలా (మీనాక్షి చౌదరి) తన అపార్ట్మెంట్లోనే హత్యకు గురి కావడంతో ఆ కేసును ఛేదించడానికి పోలీసాఫీసర్ అయిన రితిక (రితికా సింగ్) పరిశోధన మొదలుపెడుతుంది. కానీ ఈ కేసులో అనేక చిక్కుముడులు ఎదురవడంతో ఆమె డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోనీ) సాయం కోరుతుంది. వీళ్లిద్దరూ కలిసి లైలా హత్య కేసును రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతారు. లైలా కొంత కాలం డేటింగ్ చేసిన సతీష్.. ఆమెతో కొంత కాలం పని చేసిన ఫొటోగ్రాఫర్ అర్జున్.. ఆమెను అవకాశాల పేరుతో లొంగదీసుకోవాలని చూసిన ఆదిత్య కౌశిక్.. ఇలా వేర్వేరు వ్యక్తుల మీద అనుమానాలు కలుగుతాయి. మరి వీరిలో ఒకరే ఆమెను హత్య చేశారా.. ఇందులో ఇంకెవరి పాత్ర అయినా ఉందా.. ఈ మిస్టరీని వినాయక్-రితిక ఎలా ఛేదించారు అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

ఒకప్పుడంటే మర్డర్ మిస్టరీ సినిమా అనగానే ఒక డిఫరెంట్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగేది. ఆ టైపు కథల మీద సినిమాలు రావడమే తక్కువ కాబట్టి ఎప్పుడో ఒకసారి చూస్తే ఓ మోస్తరుగా ఉన్నా బాగానే అనిపించేవి. కానీ ఇప్పుడు ఈ తరహాలో కథలు మన సినిమాల్లోనే కాదు.. వెబ్ సిరీసుల్లోనూ బోలెడు చూస్తున్నాం. పైగా వరల్డ్ సినిమాలు, టీవీ షోలు అరచేతుల్లోకి వచ్చేసిన ఈ రోజుల్లో ఆద్యంతం ప్రేక్షకులను గెస్సింగ్ లో ఉంచుతూ.. కథనాన్ని బిగితో నడిపిస్తూ.. ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తూ చివరి వరకు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టడం తేలికైన విషయం కాదు. 'హత్య' టీం ఈ విషయంలో కొంతమేరే విజయవంతం అయింది. ఎవరు హంతకుడో తెలుసుకోవాలి కాబట్టి చివరి వరకు కూర్చోవడం తప్ప వేరే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి నెట్టేసేలా ఇందులో కథనం సాగుతుంది. కానీ చివర్లో ప్రేక్షకులు ఊహించలేని ఒక ట్విస్ట్.. కిల్లర్ మోటివ్.. కొత్తగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. కానీ అంతకుమించి సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

తెలుగులో బాగా పాపులర్ అయిన 'హిట్' సిరీస్‌ లో వచ్చిన ఇంకో సినిమాలా అనిపిస్తుంది 'హత్య'. సినిమా ఆరంభంలోనే ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది.. ఆమెను చంపిందెవరో ఒక డిటెక్టివ్ వివిధ కోణాల్లో పరిశోధిస్తూ.. అనుమానితులను విచారిస్తూ సాగే నేపథ్యంలో నడుస్తుంది ఈ కథ. ఆ అనుమానితుల్లో ఒక్కొక్కరితో విక్టిమ్ కు ఉన్న రిలేషన్ ఏంటో చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పోతుంటాయి. ఐతే ఇందులో ఒక్కటంటే ఒక్క ఎపిసోడ్ కూడా మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా దర్శకుడు డీల్ చేయలేకపోయాడు. ప్రతి ఎపిసోడ్ మొదలైన కొన్ని నిమిషాలకే ఇదెప్పుడు ముగిసిపోతుందా అన్న అసహనం మొదలవుతుంది. అంత డల్లుగా నడుస్తాయి ఆ ఎపిసోడ్లు. సన్నివేశాలేవీ కూడా పర్పస్ ఫుల్ గా అనిపించవు. ఫిల్లింగ్ కోసం పెట్టినట్లే ఉంటాయి. ఫొటోగ్రఫీ అదీ కూడా ఏదో ఒక కృత్రిమ ప్రపంచంలో నడుస్తున్నట్లుగా సాగడంతో సగం సినిమా అయ్యేసరికే నీరసం ఆవహిస్తుంది.

మర్డర్ మిస్టరీకి సంబంధించిన ఇన్వెస్టిగేషనే అంతంతమాత్రంగా నడుస్తుంటే.. ప్రేక్షకుల్లో మరింత అసహనం పెంచడానికా అన్నట్లు హీరో కూతురి విషాదాంతానికి సంబంధించి ఒక ఎపిసోడ్ నడిపించాడు దర్శకుడు. అది మరింత పేలవంగా.. సినిమాకు అవసరమే లేని విధంగా సాగుతుంది. సినిమా చివరి అరగంటలో అడుగు పెట్టేవరకు వేచి చూడటమే పెద్ద పరీక్ష. కానీ ఆ అరగంటలో మాత్రం 'హత్య' మెప్పిస్తుంది. సదరు అమ్మాయిని ఎవరు ఎలా హత్య చేసి ఉండొచ్చో.. వేర్వేరు కోణాల్లో చూపించే సీన్లు ఆసక్తి రేకెత్తిస్తాయి. చివరి అసలు హంతకుడెవరో చూపించే సీన్లను కూడా బాగా ప్రెజెంట్ చేశారు. విలన్ మోటివ్ అంత కన్విన్సింగ్ గా అనిపించకపోయినా.. సైకో కిల్లర్లలోని విభిన్న కోణాల్ని దర్శకుడు బయటకి తీసే ప్రయత్నం చేశాడు. ఆ కోణంలో చూస్తే ఇదొక డిఫరెంట్ ఐడియానే. ముగింపు సన్నివేశాలను బాగా తీసి.. అప్పడిదాకా పెట్టిన బాధకు కొంచెం మందేశాడు దర్శకుడు. క్లైమాక్సులో ఈ మెరుపులే లేకుంటే 'హత్య' పరిస్థితి దారుణంగా ఉండేదే. ఐతే కేవలం ఈ ట్విస్టు కోసం మిగతా నసను భరించడమే కష్టం.


నటీనటులు:

విజయ్ ఆంటోనీ కి సినిమా అంతా సీరియస్ గా.. ఒకే ఎక్స్ ప్రెషన్ తో కనిపించే పాత్ర పడితే చాలు.. డీసెంట్ అనిపిస్తాడు. 'హత్య'లో తనకు అలాంటి పాత్రే దక్కింది. ఏ సన్నివేశంలోనూ హావభావాల కోసం ప్రయత్నించాల్సిన అవసరం అతడికి లేకపోయింది. ఎప్పుడూ ముభావంగా కనిపిస్తూ.. సీరియస్ గా చూడటమే తప్ప అతను చేసిందేమీ లేదు. ఆ పాత్రకు అతను సూటయ్యాడని మాత్రం చెప్పొచ్చు. మీనాక్షి చౌదరి ఆకట్టుకుంది. ఈ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. గ్లామర్.. పెర్ఫామెన్స్ రెండింట్లోనూ ఆమె ఓకే అనిపించింది. స్వతహాగా మోడలే కావడంతో అలాంటి పాత్ర చేయడానికి ఆమె ఇబ్బంది పడలేదు. రితికా సింగ్ పాత్ర... తన నటన నామమాత్రంగా అనిపిస్తాయి. మురళీ శర్మ.. రాధికా శరత్ కుమార్.. జాన్ విజయ్.. ఇలా పేరున్న ఆర్టిస్టులు చాలామందే ఉన్నా.. వారికి తగ్గ పాత్రలు పడలేదు.


సాంకేతిక వర్గం:

సాంకేతిక విభాగాల్లో సంగీతం ప్రత్యేకంగా అనిపిస్తుంది. గిరీష్ గోపాలకృష్ణన్ స్టైలిష్ గా.. ఇంటెన్స్ గా సాగే బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను కొంచెం పైకి లేవడానికి ప్రయత్నించాడు. తన పాటలు మాత్రం ఆకట్టుకోవు. శివకుమార్ విజయన్ విజువల్స్ థ్రిల్లర్ సినిమాకు అవసరమైన మూడ్ క్రియేట్ చేయగలిగాయి కానీ.. తెర మీద అంతా ఏదో కృత్రిమ ప్రపంచంలా.. డల్లుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కానీ చాలా చోట్ల అసవరం లేని ఖర్చు కనిపిస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ బాలాజి.కె.కుమార్.. ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. తన నరేషన్ స్టైల్ మాత్రం నీరసం తెప్పిస్తుంది. చాలా చోట్ల అతను అవసరం లేని క్రియేటివిటీ చూపించాడు. ఆసక్తితో.. బిగితో కథనాన్ని చెప్పడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు.


చివరగా: హత్య.. ట్విస్ట్ మీదే మొత్తం భారం


రేటింగ్- 2/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater