అభిమాన సింగర్ ఆయనే..కానీ పాడించని మణిశర్మ!
నవతరం సంగీత దర్శకులు ఎంత మంది ఉన్నా! తన బాణీ కి మాత్రం ఎప్పుడూ ప్రత్యేకత తప్పనిసరి.
By: Tupaki Desk | 22 Dec 2023 8:08 AM GMTమెలోడీబ్రహ్మ మణిశర్మ సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. క్లాస్...మాస్ బీట్స్ తో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న మ్యూజిక్ మ్యాస్ట్రో ఆయన. నవతరం సంగీత దర్శకులు ఎంత మంది ఉన్నా! తన బాణీ కి మాత్రం ఎప్పుడూ ప్రత్యేకత తప్పనిసరి. ఓవైపు తను బిజీగా ఉంటూనూ తనయుడ్ని సైతం రంగంలోకి దించి ముందుకు సాగుతున్నారు. ఆయన కన్నా ఆయన సంగీతమే మార్కెట్ లో ఎక్కువగా వినిపిస్తుంటుంది.
మరి మణిశర్మ అభిమాన గాయకుడు ఎవరు? ఆయన మెచ్చే గాత్రం ఎవరిది? ఆయనకు సంగీత దర్శుకుడిగా సంతృప్తి చెందిన చిత్రం ఏది? అంటే చాలా సంగతులే తెలుస్తున్నాయి. అవేంటో ఆయన మాటల్లోనే... `చూడాలని వుంది' సినిమాలోని పాటలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'యమహా నగరి' పాటను పాడటానికి హరిహరన్ గారు చాలా కష్టపడ్డారు. ఆయనకి తెలుగు తెలియదు. ఒక్కో పదాన్ని పేరుస్తూ పాడాల్సి వచ్చింది.
అలా నాలుగు రోజుల తరువాత ఆయనతో ఆ పాటను పాడించాము. ఆ పాట ఆయనకి రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టింది. 'బెంగాలీ ఫ్లేవర్ ఉండేలా 'రామ్మా చిలకమ్మా' అనే పాటను ట్యూన్ చేశాను. అందుకోసం బెంగాలీ పాటలను వినవలసి వచ్చింది. నిజానికి నా ఫేవరేట్ సింగర్ బాలూగారే. అయినా ఈ పాటను మాత్రం ఉదిత్ నారాయణ్ పాడితేనే బాగుంటుందని భావించి ఆయనతో పాడించడం జరిగింది.
శంకర్ మహదేవన్ తో ఒక పాట పాడించాను. మిగతావి బాలూగారే పాడారు. కానీ ఆయనతో కొన్ని పాటలు పాడించలేదని సరదాగా జోకులేసేవారు. ఆయన అలా అంటుంటే నాకు మనసు జువ్వుమనేది. అభిమాన సింగర్ తో ఆ పాట పాడించకుండా తప్పు చేసానా? అని నాలో నాకు అనిపించేది` అని అన్నారు. ప్రస్తుతం మణిశర్మ పూరిజగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ కి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇదే కాంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో పూరి మరోసారి అదే సంగీత దర్శకుడిని రిపీట్ చేస్తున్నారు.