ఓపెన్ ఛాలెంజ్ విసిరిన నటి హేమ
ఏ ముహుర్తంలో బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమ పేరు వచ్చిందో.. అప్పటి నుంచి ఆమెకు అదే పనిగా తలనొప్పులు ఎదురవుతూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 16 Sep 2024 10:40 AM GMTఏ ముహుర్తంలో బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమ పేరు వచ్చిందో.. అప్పటి నుంచి ఆమెకు అదే పనిగా తలనొప్పులు ఎదురవుతూనే ఉన్నాయి. రేవ్ పార్టీలో పాల్గొన్న అంశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారటం.. మొదట కాదన్నా.. తర్వాత ఆమె ఆ పార్టీలో ఉన్నట్లుగా తేలింది. డ్రగ్స్ వినియోగించారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. బెంగళూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని పరప్పన అగ్రహార జైల్లో కొంతకాలం ఉండి రావటం తెలిసిందే.
ఇటీవల నటి హేమకు సంబంధించి మరోసారి వార్తలు వస్తున్నాయి. ఆమెకు చేసిన బ్లడ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని.. డ్రగ్స్ సేకరించిందన్న విషయాన్ని పేర్కొంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. పోలీసుల ఛార్జిషీట్ ఇప్పటివరకు తనకే రాలేదని.. అలాంటప్పుడు మీడియాకు ఎలా వస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు హేమ. ఈ సందర్భంగా 6 నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియోను ఆమె తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్ టీవీ క్రైం రిపోర్టర్ చీఫ్ రమేశ్ వైట్లతో తనకు గతంలో విభేదాలు ఉన్నాయని.. అప్పటి నుంచి తనను టార్గెట్ చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. ఒకసారి తాను ఎన్ టీవీ చానల్ ఆఫీసు వద్దకు వెళ్లానని.. రమేశ్ వైట్ల అక్కడ లేకపోవటంతో ఆయనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. తాను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నట్లుగా చెప్పటంతో తాను అక్కడకు వెళ్లినట్లుగా ఆమె పేర్కొన్నారు. తీరా స్టేషన్ కు వెళ్లేసరికి ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారని.. అప్పటి నుంచి తన మీద తప్పుడు ప్రచారం సాగుతుందన్నారు.
ఈ సందర్భంగా పలు తెలుగు మీడియా సంస్థల పేర్లను ప్రస్తావించిన ఆమె.. తాను కొందరితో మాట్లాడానని.. మరికొందరు అందుబాటులోకి రాలేదన్నారు. తాను డ్రగ్స్ తీసుకున్నది నిజమే అయిన పక్షంలో తన రక్తంలో ఉంటుంది కాబట్టి.. మీడియా పెద్దలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే.. ఎన్ టీవీ చౌదరి.. టీవీ5 నాయుడు.. రవిప్రకాశ్.. ఇలా మీడియా పెద్దలు కలిసి ఒకచోట ఉండి.. తనను రమ్మంటే వస్తానని.. వారి సమక్షంలోనే తాను రక్తపరీక్ష చేయించుకుంటానని.. అందుకు సదా సిద్ధమని పేర్కొన్నారు.
ఒకవేళ తాను డ్రగ్స్ తీసుకున్నట్లుగా రక్త పరీక్షల్లో తేలితే ఏశిక్షకైనా సిద్ధమని.. అదే సమయంలో తాను తీసుకోలేదన్నది తేలితే ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. తాను ఎక్కడికి పారిపోవట్లేదని.. రెండు చేతులు జోడించి మరీ అడుగుతున్నానని.. తాను బ్లడ్ టెస్టులకు సిద్ధమని పేర్కొన్నారు. తన తల్లికి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని.. తనపై తప్పుడు ప్రచారం కారణంగా ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతుందన్నారు. హేమ తాజా వీడియో సంచలనంగా మారింది. దీనిపై మీడియా పెద్దలు ఏ రీతిలో రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.