విలన్లుగా మారుతున్న హీరోలు!
ఇప్పటికే పలువురు హిందీ నటులు విలన్స్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా.. మరికొంతమంది నెగెటివ్ క్యారెక్టర్స్ ప్లే చేయడానికి రెడీ అవుతున్నారు.
By: Tupaki Desk | 27 July 2024 2:30 PM GMTపాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాషా ప్రాంతీయత అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. ఇతర ఇండస్ట్రీల నటీనటులు మన తెలుగు సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణించిన యాక్టర్స్ సైతం విలన్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు హిందీ నటులు విలన్స్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా.. మరికొంతమంది నెగెటివ్ క్యారెక్టర్స్ ప్లే చేయడానికి రెడీ అవుతున్నారు.
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇప్పుడు సౌత్ లో క్రేజీ విలన్ గా మారిపోయారు. 'యానిమల్' మూవీతో తెలుగులో ఫేమస్ అయిన బాబీ.. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నుండి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నందమూరి బాలయ్య - డైరెక్టర్ బాబీ కాంబోలో రూపొందుతున్న 'NBK 109' మూవీలోనూ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు. లేటెస్టుగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రానున్న 'దేవర' చిత్రంలోనూ భాగం అవుతున్నారు. దీంతో పాటుగా సూర్య 'కంగువ'లో నటిస్తున్నారు.
'ఆదిపురుష్' చిత్రంలో రావణుడిగా నటించిన హిందీ స్టార్ సైఫ్ అలీఖాన్.. 'దేవర' పార్ట్-1లో మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గా గుర్తింపు పొందిన ఇమ్రాన్ హష్మీ.. ఇటీవల కాలంలో ప్రతినాయకుడి పాత్రలతోనూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న 'OG' మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటుగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'గూడాచారి 2' చిత్రంలోనూ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేస్తున్నారు హష్మీ.
KGF 2, లియో చిత్రాల్లో విలన్‌గా నటించిన సీనియర్ నటుడు సంజయ్ దత్.. ప్రస్తుతం రామ్ పోతినేని - పూరీ జగన్నాధ్ కాంబోలో రూపొందుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీలో పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న 'RC 16' సినిమాలో సంజూ భాయ్ లేదా బాబీడియోల్ ని ప్రధాన ప్రతినాయకుడిగా తీసుకునే అవకాశం ఉందని టాక్. 'భగవంత్ కేసరి'తో అర్జున్ రాంపాల్ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'వీరమల్లు'లో ముందుగా అర్జున్ నే విలన్ గా తీసుకున్నారు. ఆయన తప్పుకోవడంతో చివరకు ఆ పాత్ర బాబీ వద్దకు వెళ్ళింది. గతంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 2.O మూవీలో నెగెటివ్ రోల్ చేయగా.. 'ఏజెంట్' సినిమాలో డినో మోరియా విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే.
ఇక సౌత్ స్టార్ హీరోలు కూడా ఈ మధ్య కాలంలో విలన్ రోల్స్ కు సై అంటున్నారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'కల్కి 2898 AD' సినిమాలో కమల్ హాసన్ నెగెటివ్ క్యారక్టర్ ప్లే చేసారు. సుప్రీం యాస్కిన్ గా అదరగొట్టారు. 'కల్కి 2'లో కమల్ మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. ఇక కింగ్ అక్కినేని నాగార్జున సైతం ప్రతినాయకుడిగా నటించడానికి పచ్చజెండా ఊపినట్లుగా టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలయికలో రాబోతున్న 'కూలీ' మూవీలో నాగ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా హీరోగా ఓ వెలుగు వెలిగిన అనేకమంది స్టార్స్ విలన్ క్యారెక్టర్స్ కు ఓకే అంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకెంతమంది హీరోలు విలన్లుగా మారుతారో చూడాలి.