హీరోయిన్, పాటలు లేకుంటే మెగాస్టార్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
విశ్వంభర పూర్తి అయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుంది. నాని ఈ సినిమాను సుస్మిత తో కలిసి నిర్మించబోతున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 18 Dec 2024 7:50 AM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో భారీ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో 'విశ్వంభర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విశ్వంభర సినిమాను 2025 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాకి త్వరలోనే గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వంభర పూర్తి అయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుంది. నాని ఈ సినిమాను సుస్మిత తో కలిసి నిర్మించబోతున్న విషయం తెల్సిందే.
'దసరా' వంటి విభిన్న చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ది పారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ముగించి చిరంజీవితో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెల సినిమా అంటే చాలా విభిన్నంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. చిరంజీవితో చేయబోతున్న సినిమాలో హీరోయిన్ ఉండదు అని, పాటలు ఉండవు అంటూ వార్తలు వస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ సినిమా ఉండనుందట.
మెగాస్టార్ ఫ్యాన్స్ చిరంజీవి సినిమా అంటే అందమైన హీరోయిన్ నాలుగు అయిదు పాటలు, రెండు మూడు ఫైట్లు కచ్చితంగా ఉండాలని కోరుకుంటారు. అలా లేకుంటే వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. అద్భుతమైన కంటెంట్ ఉంటే తప్ప హీరోయిన్ లేదు అనే విషయాన్ని ప్రేక్షకులు గుర్తించకుండా లీనం అవుతారు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటే తప్ప పాటలు లేవా అనే ఫీలింగ్‌కి ప్రేక్షకులు వెళ్లరు. అందుకే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను హీరోయిన్, పాటలు లేకుండా మెప్పించాలంటే అల్టిమేట్ సబ్జెక్ట్, స్క్రీన్‌ప్లే అవసరం.
చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కడం పైగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమాలు చేసే అవకాశం దక్కడం అనేది మామూలు విషయం కాదు. నాని నిర్మిస్తున్న ఈ సినిమా మెగాస్టార్ ఈమధ్య కాలంలో చేసిన సినిమాల్లోకి ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్ లేకపోవడం, పాటలు లేకపోవడంను చాలా మంది తప్పు బట్టి ఆ సినిమాను తిరస్కరించారు. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం అయితే పరిస్థితి ఏంటి అంటూ కొందరు శ్రీకాంత్ ఓదెలను, నానిని ప్రశ్నిస్తున్నారు. కానీ వారు మాత్రం చిరంజీవి సినిమాపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. త్వరలో ప్రారంభం కాబోతున్న చిరంజీవి, ఓదెల మూవీ 2025లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.