ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా కథానాయికల పోరాటం
ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటానికి భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.
By: Tupaki Desk | 2 Sep 2023 3:48 AM GMTప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటానికి భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇటీవల పలువురు కథానాయికల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ భామలంతా తమ సొంత కంపెనీలు స్థాపించి, ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నా ఎంపిక చేసుకున్న మార్గం ఉత్తమమైనదని ప్రశంసలు కురుస్తున్నాయి. తమ ఉత్పత్తులతో లాభాలు దండుకోవాలనే ఆలోచన మాత్రమే కాకుండా కాలుష్య రహిత తయారీ విధానం ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందాల కృతి సనన్ కి చెందిన బ్రాండ్ హైఫన్, అలియా భట్ కి చెందిన ఎడ్-ఎ-మమ్మా, అనుష్క శర్మకు చెందిన బ్లూ ట్రైబ్... దీపికా పదుకొనేకి చెందిన 82.E కంపెనీ.. ఇవన్నీ ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకం. వీరంతా ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తులకు మాత్రమే తమ మద్ధతును పలికారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణంపై ప్రభావం గురించి పెరుగుతున్న ఆందోళనల నడుమ సెలబ్రిటీల నుంచి ఒక అద్భుతమైన ధోరణి ఉద్భవించింది - ప్లాస్టిక్-తటస్థ బ్రాండ్ల పెరుగుదల ఎంతో మేలైనదని సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. ఈ స్పూర్తిదాయకమైన ఉద్యమంలో ప్రముఖు కథానాయికలు ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. వ్యాపారాన్ని మించిన మిషన్‌తో వారి బ్రాండ్‌లను సమతూకం చేయడం ద్వారా వారు లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భూ గ్రహంపై పర్యావరణ సమతుల్యత పునరుద్ధరణలో సదరు సెలబ్రిటీలు చురుకుగా పాల్గొంటున్నారు.
కృతి సనన్ సొంత బ్రాండ్ హైఫన్ కేవలం చర్మ సంరక్షణ బ్రాండ్ మాత్రమే కాదు. అది ఒక స్థిరమైన విప్లవం. నైతిక పద్ధతులు, పర్యావరణ బాధ్యతకు అంకితభావంతో 100 శాతం శాకాహార నిబంధనలతో ఈ ఉత్పత్తి రూపొందుతుంది. జీరో ప్లాస్టిక్ నియమంతో ప్రతిదీ తయారు చేస్తున్నారు. పరిశుభ్రమైన, పచ్చటి ప్రపంచం రూపకల్పన పై అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంకా ఆలియా భట్ కి చెందిన బ్రాండ్ 'ఎడ్-ఎ-మమ్మా' పిల్లల దుస్తుల రూపకల్పనలో ప్రత్యేకతను సంతరించుకుంది. పిల్లల కోసం సరసమైన ధరలకు స్థిరమైన దుస్తుల ఎంపికలను అందించే ప్రపంచ-స్థాయి స్వదేశీ బ్రాండ్ లేకపోవడంతో అలియా భట్ 2020లో దీనిని ప్రారంభించబడింది. హానికరమైన రసాయనాలు, పురుగుమందులు, సింథటిక్ రంగులు లేని పదార్థాలను ఉపయోగించడానికి ఈ కంపెనీ ప్రాధాన్యతనిస్తుంది. సేంద్రీయ పత్తి నుండి పర్యావరణ అనుకూల బట్టల రూపకల్పనకు మార్గదర్శకంగా నిలిచే సంస్థ ఇది. మెటీరియల్‌ల ఎంపికతో కలిపి, ఎడ్-ఎ-మమ్మా నైతిక తయారీ పద్ధతుల అమలుపై దృష్టి పెడుతుంది. ఈ సంస్థను రిలయన్స్ అంబానీలు కొనుగోలు చేస్తున్నారని ఇటీవల కథనాలొచ్చాయి.
అదేవిధంగా అనుష్క శర్మ -విరాట్ కోహ్లీ పెట్టుబడి పెట్టిన మొక్కల ఆధారిత మాంసం ఉత్పత్తుల సంస్థ 'బ్లూ ట్రైబ్' మొక్కల ఆధారిత పానీయాల విషయంలో కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తోంది. అన్ని సహజ పదార్థాలు, స్థిరమైన ప్యాకేజింగ్ పై నిబద్ధతతో నడిచే 'బ్లూ ట్రైబ్' ఒక మార్పుకు చిహ్నం. ప్లాస్టిక్ ఉద్గారాలను నివారిస్తూ కార్బన్‌ను తటస్థంగా ఉత్పత్తి చేయడం ద్వారా, భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని భూగ్రహాన్ని స్థిరపరచడంలో సహాయపడతాయి. ఇలాంటి గొప్ప ఆలోచనలు గణనీయమైన మార్పులకు దారితీస్తాయని నిరూపణ అవుతోంది. అలాగే దీపికా పదుకొణె 82.E అనేక రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది. వైద్యపరంగా పరీక్షించిన శాశ్వత ముద్ర వేస్తున్న బ్రాండ్ ఇది. కార్బన్-న్యూట్రల్ పద్ధతులు స్థిరమైన భవిష్యత్తు వైపు మార్గాన్ని ఈ కంపెనీ రూపొందిస్తోంది. పరిశ్రమ అగ్ర నాయికలుగా వెలుగొందుతున్న పలువురు కథానాయికలు ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉండడం ప్రశంసించదగినది.