డైరెక్టర్లు జనాల్ని చదవడం లేదంటోన్న హీరో!
తెరకెక్కించినవి కొన్ని సినిమాలే అయినా గొప్ప చిత్రాలతో టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయారు.
By: Tupaki Desk | 6 March 2024 6:02 AM GMTవిప్లవాత్మక చిత్రాలకు పెట్టింది పేరు టి.కృష్ణ. తెలుగు తెరపై కృష్ణ గారి రివెల్యూషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ టాలీవుడ్ మెచ్చిన ఏకైక మేకర్. గోప్ప అభ్యుదయ భావజాలం కల దర్శకుడు. అందుకే 'నేటి భారతం'..'దేశంలోదొంగలుపడ్డారు'..'దేవాలయం'..'వందేమాతరం'..'ప్రతిఘటన'..'రేపటి పౌరులు' లాంటి గొప్ప కళా ఖండాలు వెలసిల్లాయి. తెరకెక్కించినవి కొన్ని సినిమాలే అయినా గొప్ప చిత్రాలతో టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయారు.
ఆయన వారసుడిగా టాలీవుడ్ లోకి గోపీచంద్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాయన దర్శకుడు అయినా...తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. తాజాగా 'భీమా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తండ్రిలా తనయుడు విప్లవ చిత్రాలు చేయడం లేదేంటి? అన్న ప్రశ్నకు గోపీచంద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'నాకు తెలిసి అప్పట్లో మా నాన్న తరం దర్శకులంతా బయట జనాల్లో తిరిగేవారు. వాళ్ల జీవితాల్ని అందులో కష్టాల్ని చాలా దగ్గరగా చూసారు.
అలా వాళ్ల చూసిన సమస్యల నుంచి కథలుగా తీసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడంతా డీవీడీలు..ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారు తప్ప తప్ప బయట జనాల్ని చదవడం లేదు. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ వందశాతం బయట జరుగుతుంది ఇదే. బయట సమాజంలోకి వెళ్తే బోలెడు సమస్యలు తెలుస్తాయి. వాటిని సినిమా రూపంలో మార్చి ఆ కథలకు కాస్త షుగర్ కోటింగ్ ఇస్తే రెండున్నర గంటలు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా మంచి సినిమా అందించొచ్చు.
కానీ అలాంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. శంకర్ తో పాటు ఇప్పుడొస్తున్న కొంత మందే అలా చేయగల్గుతున్నారు. కాకపోతే ఆ కథల్లో ఇంకా బలమైన ముద్ర వేయగలగాలి. ప్రేక్షకుల్ని ఎమోష నల్ గా కనెక్ట్ చేయాలి అంటే మరింత బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. గోపీచంద్ చాలా ఇంట్రెస్టింగ్ విషయమే చెప్పాడు అనాలి. కల్పిత కథలకంటే వాస్తవ సంఘటనలు..సమస్యలు ఆధారంగా చెప్పిన కథలు ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్తాయి. వాటికి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల కాలంలో ఆ తరహా కంటెంట్ కి ఆదరణ కూడా పెరిగింది. నవతరం దర్శకులు ఆ రకమైన ఆలోచన దృక్ఫధంతో ముందుకెళ్లగలిగితే మంచి భవిష్యత్ ఉంటుంది.