మన హీరోలే అయినా, మారకుంటే కష్టమే..!
ఈ వయసులో వీరు ఇంకా, తమ కూతుళ్ల వయసు ఉన్న అమ్మాయిలతో చిన్న పిల్లల్లాగా రొమాన్స్, డ్యూయట్స్ చేయడం కాస్త ఇబ్బంది పెట్టే విషయమే.
By: Tupaki Desk | 19 Aug 2023 6:45 PM GMTహీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. వారు పట్టుమని పది సినిమాలు వరసగా చేశారు అంటే, మళ్లీ వాళ్లను హీరోయిన్లుగా చూడాలి అంటే ప్రేక్షకులకు బోర్ వచ్చేస్తుంది. కానీ, హీరోల విషయంలో అలా కాదు. వాళ్లు ఒక్కసారి సినిమా చేసి సక్సెస్ అయ్యారు అంటే, ఇక 100, 150 ఇలా కౌంట్ పెరుగుతూనే ఉంటుంది. అలా మన టాలీవుడ్ సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున అందరూ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నవారే.
అయితే, వీరు యూత్ గా ఉన్నప్పుడు హీరోయిన్లతో రొమాన్సులు, డ్యూయట్లు పాడుకుంటూ డ్యాన్సులు వేశారు. అవి ప్రేక్షకులకు బాగా నచ్చి విజిల్స్ కూడా వేశారు. అయితే, ఇప్పుడు వారి వయసు పెరిగిపోతోంది. అయినా, వారి సినిమాల్లో చూడటానికి ఫ్యాన్స్ ఉత్సాహంగానే ఉన్నారు. కానీ, వారి నుంచి వస్తున్న సినిమాలు, వారు చేసే పాత్రలే కాస్త ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.
ఈ నలుగురు హీరోల వయసు పెరిగిపోయింది. చిరంజీవి, బాలకృష్ణలకు అయితే, మనవళ్లు, మనవరాళ్లు కూడా వచ్చేశారు. నాగార్జున ఇద్దరు కొడుకులు హీరోలుగా సత్తా చాటుతున్నారు. వెంకటేష్ కొడుకు చిన్నవాడే అయినా, ఆయన వయసు కూడా అటు, ఇటుగా వారితో పాటే ఉంటుంది. మరి, ఈ వయసులో వీరు ఇంకా, తమ కూతుళ్ల వయసు ఉన్న అమ్మాయిలతో చిన్న పిల్లల్లాగా రొమాన్స్, డ్యూయట్స్ చేయడం కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. ఈ విషయంలో కాస్త వెంకటేష్ పర్వాలేదు.
కనీసం దృశ్యం, నారప్ప లాంటి సినిమాల్లో వయసుకు తగినట్లు తండ్రి పాత్ర పోషించాడు. ఆ రెండూ డబ్బింగ్ సినిమాలే అయినా, ఆ పాత్రకు బాగా నప్పాడు. ఇక, స్ట్రైయిట్ గా తెలుగు సినిమాలోనూ ఆయన అలా కనిపిస్తేనే బాగుంటుంది. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటివాళ్లు, ఎలాగైతే తమ వయసు తగిన పాత్రలు చేసి జైలర్, విక్రమ్ లాంటి సినిమాలతో హిట్ కొట్టారో, ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణలు కూడా అలాంటి పాత్రలు ఎంచుకోక తప్పదు.
బాలయ్య కాస్త సినిమాల్లో వైవిధ్యం చూపిస్తూ ఉన్నారు. కానీ, ముఖ్యంగా చిరంజీవి కథల విషయంలో, తన పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, నాగార్జున చూడటానికి యంగ్ గా కనిపించినా, ఆయన కూడా మరీ కుర్రాళ్ల పాత్రలు కాకుండా, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్లంతా మన హీరోలు. వీళ్లను చూస్తేనే పెరిగాం. అయినా, వీరు కథల విషయంలో మారకుంటే, మనమే వీళ్లను ఆదరించడం కస్టమౌతుంది. మరి వరస ఫెయిల్యూర్స్ చూసిన తర్వాతైనా వారిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.