ట్రెండీ టాక్: నట వారసులొస్తున్నారు!
అతడి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినీఎంట్రీ ఇచ్చినా కానీ, ఇటీవల గ్యాప్ తీసుకున్నాడు.
By: Tupaki Desk | 28 July 2024 11:30 PM GMTటాలీవుడ్ లో నలుగురు అగ్ర హీరోలు మూల స్థంబాలుగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటే, కింగ్ నాగార్జున ఆ నలుగురు. అయితే ఇందులో మెగాస్టార్ కుటుంబం నుంచి అరడజను మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. చరణ్, బన్ని, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ హీరోలుగా కొనసాగుతున్నారు. అదనంగా నాగబాబు వారసురాలు నిహారిక కూడా నటిగా కొనసాగుతోంది. అక్కినేని నాగార్జున కుటుంబం నుంచి నలుగురైదుగురు ఉన్నారు.
ప్రధానంగా నాగచైతన్య, అఖిల్ హీరోలుగా వరస చిత్రాలు చేస్తున్నారు. సుమంత్, సుశాంత్ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. సుప్రియ నిర్మాతగా, నటిగాను కొనసాగుతున్నారు. విక్టరీ వెంకటేష్ ఇద్దరు కుమార్తెలు సినీరంగంలో లేరు. కానీ డి.సురేష్ బాబు వారసుల్లో రానా ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. అతడి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినీఎంట్రీ ఇచ్చినా కానీ, ఇటీవల గ్యాప్ తీసుకున్నాడు.
అదంతా అటుంచితే నందమూరి కుటుంబం నుంచి, ఘట్టమనేని కుటుంబం నుంచి నటవారసుల (కొత్త హీరోల) రాక గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడి రాక గురించి కూడా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ 2025లో ఉంటుందని కథనాలొస్తున్నాయి. నిజానికి నాలుగైదేళ్లుగా మోక్షు ఎంట్రీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నా అది వీలుపడటం లేదు. ఎట్టకేలకు హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గుసగుసలు వినపిస్తున్నాయి.
కానీ అధికారికంగా ఇంకా ప్రాజెక్టును ప్రకటించాల్సి ఉంది. మోక్షజ్ఞ ఇప్పటికే నటన-డ్యాన్సులు-ఫైట్స్ లో తర్ఫీదు పొందాడని కూడా కథనాలొచ్చాయి. అలాగే ఘట్టమనేని కుటుంబంలో మహేష్ బాబు సూపర్ స్టార్ గా రేసులో ఉన్నారు. ఆయన వారసుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం విదేశాలలో అకడమిక్ స్టడీస్ పైనే దృష్టి పెట్టాడు. పనిలో పనిగా అతడు న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో నటశిక్షణ తీసుకుంటున్నాడని ఇటీవల తెలుగు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనర్థం గౌతమ్ ఇప్పటి నుంచే ప్రిపేరవుతున్నాడు. కానీ అతడు సినీరంగంలో ఆరంగేట్రం చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అంచనా. నందమూరి, ఘట్టమనేని లెగసీని నడిపించేదుకు వారసులొస్తున్నారనేది ఫ్యాన్స్ కి ఎగ్జయిట్ చేసే అంశమే అయినా దీనిపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.
మరోవైపు పవన్ కల్యాణ్- రేణు దేశాయ్ ల వారసుడు అకీరా నందన్ కూడా తన తల్లిదండ్రుల లెగసీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అకీరా నందన్ సినీఎంట్రీ గురించి ఇప్పటివరకూ సరైన స్పష్ఠత లేదు. కానీ అతడు కూడా ప్రిపరేషన్ లో ఉన్నాడని, నటశిక్షణ తీసుకుంటున్నాడని ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఆరున్నర అడుగుల బుల్లెట్టులా టాలీవుడ్ లోనే అత్యంత ఎత్తైన హీరోగా అకీరా నందన్ ప్రకంపనాలు ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
హిందీలో అరడజను నటవారసులు రెడీ:
అటు బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు వారసుడు జునైద్ ఖాన్ మహారాజా చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చాడు. తదుపరి కింగ్ ఖాన్ షారూఖ్ వారసురాలు సుహానా ఓటీటీ డెబ్యూ అనంతరం పెద్ద తెర ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ కూడా సుహానా మాదిరిగానే పెద్ద తెర ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ నుంచి చాలా మంది నటవారసులు రేసులో ఉన్నారని తెలుస్తోది.