విశాల్‌కి ప్రశ్న! పవన్‌ని కాదని జగన్‌కే సపోర్ట్ చేస్తున్నారు?
ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లాలంటే గట్స్ ఉండాలి. ఇండస్ట్రీ నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళుతున్నారు
By: Tupaki Desk | 21 April 2024 5:08 AM GMTఇటీవల తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని హీరో విశాల్ ప్రకటించారు. తమిళనాడులో దళపతి విజయ్ తర్వాత విశాల్ రాజకీయారంగేట్రం చర్చనీయాంశంగా మారింది. తెలుగు లోగిళ్లలోను అతడి అభిమానుల్లో దీనిపై చర్చ సాగుతోంది. అయితే రాజకీయాల్లోకి వస్తున్న విశాల్ కి తాజా చిత్రం రత్నం- తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ లో రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటరాక్షన్ లో విశాల్ ఏపీ సీఎం వైయస్ జగన్ పై అభిమానం కురిపించారు. జగనే నెక్ట్స్ సీఎం అంటూ ప్రకటించారు. దీనిపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాల్ ఇండస్ట్రీ వ్యక్తి అయి ఉండి పవన్ కి సపోర్ట్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు.
ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లాలంటే గట్స్ ఉండాలి. ఇండస్ట్రీ నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళుతున్నారు. మీ నుంచి ఆయనకు సపోర్ట్ ఉందా? అంటూ విశాల్ ని ఒక అభిమాని తాజా ఇంటరాక్షన్ లో ప్రశ్నించారు. దానికి విశాల్ జవాబిస్తూ... ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ రాజకీయాల్లోకి రావాలి.. అని అన్నారు.
పవన్ గురించి కాకుండా జగన్ గురించి మాట్లాడుతున్నారు.. కదా? అని ప్రశ్నించగా.. ``మీకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టం.. మాకు వేరొకరు ఇష్టం. కాదు లేదు అని మీరు (విద్యార్థులు, అభిమానులు) నన్ను అడగొచ్చు.. కానీ నేను అలా అడగకూడదు. కాలేజ్ లో అందరూ అందమైన అమ్మాయిలు ఉంటారు.. అందరినీ ప్రేమించొచ్చా.. నాకు నచ్చిన ఒకరినే ప్రేమిస్తాను.. ఇది కూడా అంతే... మీరు ఫలానా వారినే ఇష్టపడాలని నేను అనడం కరెక్ట్ కాదు.. మీరు అనొచ్చు.. అని తమాషాగా మాట్లాడారు.
మరిన్ని ప్రశ్నలకు విశాల్ జవాబులు ఇలా ఉన్నాయి:
*మీరు నిన్న తమిళనాడు ఎన్నికల్లో ఓట్ వేసినప్పుడు సైకిల్ పై వెళ్లారు. చివరి సారి విజయ్ కూడా ఇలానే సైకిల్ పై వెళ్లారు. మీరు విజయ్ ని ఫాలో చేస్తున్నారని అంటున్నారు! అని ప్రశ్నించగా...
దానికి అది కారణం కాదు.. నా బైక్ లన్నీ అమ్మేశాను. ఖాళీగా ఉంటే ఎలకలు వైర్లు కొరికేస్తున్నాయి. మా ఊరి రోడ్లు సరిగా లేవు. సస్పెన్సన్ మూడు నెలలకోసారి మార్చాలి. అనవసరంగా డబ్బు ఖర్చవుతోంది. అందుకే అమ్మేశాను. అందుకే సైకిల్ కొనుక్కుని దానిపై వెళ్లాను. సైకిల్ పై వెళ్లినా, షేర్ ఆటోలో వెళ్లినా ఓటేయడం ముఖ్యం అంతే..
*ఈసారి జగన్ రాకూడదు అంటున్నారు.. ఆయన వల్ల ప్రజలకు నష్టం జరిగిందంటున్నారు..!?
ప్రతి నాయకుడికి ఇటు ఉంటారు.. అటు ఉంటారు.. దానికి అభ్యంతరం చెప్పను..
*రత్నంలో ప్రియా భవానీనే హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం?
ఈ సినిమాలో ఒక విషయం ఉంది. సినిమా చూస్తేనే అది మీకు తెలుస్తుంది. తన కెరీర్ లో ఉత్తమ పాత్రలో నటించింది. ప్రతి హీరోయిన్ ఇలాంటి రోల్ చేయాలని అసూయ కలిగించే పాత్ర అది.. .అని విశాల్ అన్నారు.