16 ఏళ్ల లోపు పిల్లలకు అన్ని షోలకు అనుమతి
16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షో లకు అనుమతించాలని తెలంగాణ హైకోర్ట్ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.
By: Tupaki Desk | 1 March 2025 11:57 AM IST16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షో లకు అనుమతించాలని తెలంగాణ హైకోర్ట్ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ పిల్లలకు టైమింగ్స్ తో పని లేకుండా థియేటర్లలోకి అనుమతించాలని తీర్పు వెలువడింది. అయితే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతిని కోర్టు నిరాకరించింది. కేసు తదుపరి విచారణ మార్చి 17 కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారు.
అల్లు అర్జున్ `పుష్ప 2` షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా, ఆమె 10 ఏళ్ల కుమారుడు కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత బెనిఫిట్ షోల నిషేధంపై సీనియర్ జర్నలిస్ట్ ఒకరు కేసు వేసారు. తెల్లవారుఝామున బెనిఫిట్ షోలను నిషేధించాలంటూ పిటిషనర్ కోరడంతో కోర్టు దీనిని పరిశీలించింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు రాకుండా నిషేధించాలని ఆదేశిస్తూ జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఇటీవల ఉత్తర్వులను జారీ చేసారు. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్‌ల అసోసియేషన్ గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో హైకోర్టులో జడ్జి ఇరువైపులా వాదోపవాదాలు విన్నారు. సింగిల్ జడ్జి ముందు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు. అనంతరం తుది ఉత్తర్వుల రూపంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, అది మల్టీప్లెక్స్‌ల వ్యాపారానికి తీవ్ర ఆటంకంగా మారింది. అయితే ప్రధాన న్యాయమూర్తి బెంచ్ రిట్ అప్పీల్‌ను స్వీకరించడానికి నిరాకరించింది. పిటిషనర్లు అప్పీల్‌ను ఉపసంహరించుకుని ఉపశమనం కోసం సింగిల్ జడ్జి ముందు పిటిషన్‌ను దాఖలు చేయడానికి అనుమతించింది. దాని ప్రకారం... విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ముందు సమీక్ష పిటిషన్ దాఖలు చేస్తామని వారికి ఉపశమనం లభించకపోతే, డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ తెలిపింది.
నిజానికి పుష్ప 2 , గేమ్ ఛేంజర్ లకు తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేయడానికి అనుమతించిన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమల్ పిటిషన్ వేయగా అప్పట్లో కోర్టు విచారించింది. 1970 నాటి ఏపీ సినిమా (నిబంధనలు) నిబంధనల ప్రకారం సినిమాటోగ్రఫీ ఎగ్జిబిషన్ లైసెన్స్‌లోని ఫారమ్ బిలోని లైసెన్స్ కండిషన్ 12(43) ఉదయం 8.40 గంటల ముందు లేదా తెల్లవారుజామున 1.30 గంటల తర్వాత సినిమాల ప్రదర్శనను అనుమతించదని న్యాయవాది వాదించారు. పిల్లలు రాత్రి వేళ ఆలస్యంగా సినిమాలు చూడటానికి అనుమతించరాదని, దాని వలన శారీరక , మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు. ఈ వాదనను అంగీకరిస్తూ 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు లేదా మల్టీప్లెక్స్‌లలో తెల్లవారుజామున సినిమా ప్రదర్శనలను చూడటానికి అనుమతించరాదని కోర్టు ఆదేశించింది. కింది కోర్టులో తీర్పుకు అనుకూలంగానే పై కోర్టు కూడా ధృవీకరించింది. ఇకపై పిల్లలు 11 గంటల తర్వాత అర్థరాత్రి షోలు చూసేందుకు అనుమతి లేదని పేర్కొనగా, ఇప్పుడు హైకోర్టులో ఉత్తర్వులను సవరించడం విశేషం.