Begin typing your search above and press return to search.

'గేమ్‌ ఛేంజర్‌' స్పెషల్‌ షోలపై హైకోర్ట్ సీరియస్‌

కానీ అనూహ్యంగా ఒక్క రోజు ముందు రాత్రి సమయంలో టికెట్ల రేట్లను పెంచుకోవచ్చు అంటూనే ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంతో నిర్మాతకు చాలా పెద్ద వెసులుబాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 11:04 AM GMT
గేమ్‌ ఛేంజర్‌ స్పెషల్‌ షోలపై హైకోర్ట్ సీరియస్‌
X

రామ్‌ చరణ్ హీరోగా నటించిన గేమ్‌ ఛేంజర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో టికెట్‌ రేట్లు పెంపుకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రత్యేక షోలకు అనుమతి దక్కిన విషయం తెల్సిందే. పుష్ప 2 సినిమా ఘటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు అనేది అసాధ్యం అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక్క రోజు ముందు రాత్రి సమయంలో టికెట్ల రేట్లను పెంచుకోవచ్చు అంటూనే ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంతో నిర్మాతకు చాలా పెద్ద వెసులుబాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

గేమ్‌ ఛేంజర్ సినిమా టికెట్‌ రేట్ల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంపై తెలంగాణ హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలైంది. పిటీషన్‌పై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. బెనిఫిట్ షోలు కాకుండా ప్రత్యేక షోలు అంటూ అనుమతి ఇవ్వడం ఏంటి? అర్థరాత్రి సమయంలో సినిమాల ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ప్రేక్షకుల భద్రతకు ఏమాత్రం కరెక్ట్‌ కాదని హైకోర్ట్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. అర్థరాత్రి తర్వాత ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని సూచించింది. బెనిఫిట్‌ షోలు రద్దు చేశామంటూ ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంను ఎలా అర్థం చేసుకోవాలంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో పాటు బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నెల రోజులు దాటినా ఇంకా ఆసుపత్రిలోనే ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఆ ఘటనపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్‌ రేట్ల పెంపు ఉండవు అంటూ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తాను కుర్చీలో ఉన్నంత కాలం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వను అన్నారు. అంతే కాకుండా ప్రత్యేక షోలకు సైతం అనుమతి ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పారు. కానీ బెనిఫిట్ షోలు కాకుండా ప్రత్యేక షోలు అంటూ అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేట్లను సైతం పెంచుకునేందుకు అనుమతించారు.

ఈ విషయమై మాజీ మంత్రి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌ రావు స్పందిస్తూ.. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోస్ కి అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే. ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ అనుమతులు ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే మాట మార్చారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయి అంటూ ట్వీట్‌ చేశారు.