'అభ్యర్థన కోర్టు ముందు కాదు'... ఆర్జీవీకి హైకోర్టులో బిగ్ షాక్!
ఈ సమయంలో ఆర్జీవీపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
By: Tupaki Desk | 18 Nov 2024 7:39 AM GMTగతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చర్చ బలంగా నడిచిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఆర్జీవీపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇందులో భాగంగా... ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. దీంతో.. ఇటీవల మద్దిపాడు పోలీసులు ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వెళ్లి ఆర్జీవీకి నోటీసులు అందించారు. దీంతో... అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. ఈ సమయంలో ఆ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం స్పందించింది.
అవును... సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిపై ఏపీలో పోలీసులు ఉక్కుపాదం మోపుతోన్న వేళ.. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనా కేసులు నమోదైన అసంగతి తెలిసిందే. ఈ సమయంలో... అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఇదే సమయంలో.. అరెస్ట్ పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది. మరోపక్క... పోలీసు విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ విజ్ఞప్తి చేశారు. అయితే... ఈ అభ్యర్థనను పోలీసుల ముందు చేసుకోవాలని.. కోర్టు ముందర కాదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
కాగా గతంలో "వ్యూహం" సినిమా విడుదల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ ల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం... పై విధంగా స్పందించింది.