హిట్ 3 సోలో రిలీజ్ సాధ్యమేనా..?
నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న 'హిట్ 3' నుంచి తాజాగా టీజర్ వచ్చింది. అర్జున్ సర్కార్ లాఠీని తాజాగా పరిచయం చేశారు.
By: Tupaki Desk | 27 Feb 2025 9:56 AM GMTనాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న 'హిట్ 3' నుంచి తాజాగా టీజర్ వచ్చింది. అర్జున్ సర్కార్ లాఠీని తాజాగా పరిచయం చేశారు. నాని బర్త్ డే సందర్భంగా విడుదలైన హిట్ 3 టీజర్‌కి అనూహ్య స్పందన దక్కింది. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న టీజర్‌గా నిలిచింది. కింగ్డమ్ టీజర్ వ్యూస్‌ను క్రాస్ చేసి హిట్ 3 సినిమా వ్యూస్ నమోదు చేసింది. దాంతో హిట్ 3 సినిమాకు ఉన్న బజ్ ఏంటో క్లారిటీ వచ్చింది. నాని సినిమా కావడంతో పాటు హిట్ ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిట్ 3 పై అంచనలు భారీగా ఉన్నాయి.
హిట్ 3లో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన లుక్, టీజర్ రివీల్ అయింది. సినిమాను మే 1న విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఆ సమయంలో మరే సినిమా లేదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సోలో రిలీజ్ దక్కినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హిట్ 3 విడుదలకు ఒక వారం రోజుల ముందు మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా విడుదల కాబోతుంది. ఏప్రిల్ 25న విడుదల కాబోతున్న కన్నప్ప వల్ల హిట్ 3 కి పెద్దగా సమస్య ఉండక పోవచ్చు. వారం గ్యాప్‌లో కన్నప్పకి హిట్ టాక్ వస్తే సాధ్యం అయినంత ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశాలు ఉంటాయి.
ఆ తర్వాత కన్నప్ప ఉన్నా ఒక వర్గం ప్రేక్షకులు అటు వెళ్తారు. హిట్ 3 సినిమాకు పెద్దగా డ్యామేజీ అనేది ఉండదు. కానీ మే 1న సూర్య హీరోగా నటిస్తున్న 'రెట్రో' సినిమాను విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న రెట్రో సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే టీజర్‌తో పాటు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల ముందు ప్రకటించారు. దాంతో మే 1 న రెట్రో విడుదల కావడం కన్ఫర్మ్ అనే అభిప్రాయం, నమ్మకం తమిళ్ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది.
సూర్య రెట్రోతో పాటు మే 1న విక్రమ్ 'ధృవ నక్షత్రం' సినిమాను సైతం విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ధృవ నక్షత్రం సినిమా విడుదల అయినా హిట్ 3కి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ రెట్రో సినిమా విషయంలోనే పోటీ తప్పదు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిట్ 3 కి రెట్రో నుంచి పోటీ తక్కువ అయినా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ 3 ని విడుదల ప్లాన్ చేస్తే తమిళనాట కచ్చితంగా పెద్ద డ్యామేజీ తప్పదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హిట్ 3 సినిమాపై ఉన్న నమ్మకంతో పోటీ అయినా తప్పదు అనే ఉద్దేశంతో తమిళనాట భారీ ఎత్తున విడుదల చేస్తారా లేదంటే రెట్రోకి తల వంచి వారం తర్వాత విడుదల చేస్తారా అనేది చూడాలి.