Begin typing your search above and press return to search.

థ్రిల్ చేస్తాడనుకుంటే.. మాస్ చూపించాడు

హిట్ సినిమా ఫ్రాంఛైజీతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు శైలేష్ కొలను.

By:  Tupaki Desk   |   5 Sep 2024 7:30 PM GMT
థ్రిల్ చేస్తాడనుకుంటే.. మాస్ చూపించాడు
X

హిట్ సినిమా ఫ్రాంఛైజీతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు శైలేష్ కొలను. విశ్వక్సేన్ హీరోగా చేసిన ‘హిట్’, అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన ‘హిట్-2’ రెండూ కూడా ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేశాయి. మంచి ఫలితాన్నందుకున్నాయి. ఐతే ఈ రెండు చిత్రాలనూ నిర్మించిన నేచురల్ స్టార్ నానినే ‘హిట్-3’లో హీరోగా మారబోతున్నాడని ‘హిట్-2’ చివర్లో హింట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ కోసమే ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ చేశాడు శైలేష్ కొలను. ఐతే హిట్ సిరీస్‌లో నాని నటిస్తున్నాడంటే ఆటోమేటిగ్గా అతను టేకప్ చేసిన కేసుకు సంబంధించి ఏదైనా హింట్ ఇచ్చి.. దాని గురించి హీరో పరిశోధన చేసే తీరుపై ఉత్కంఠ రేపేలా టీజర్ ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ శైలేష్ మాత్రం టీజర్‌ను అంచనాలకు భిన్నంగా చూపించాడు.

కశ్మీర్లో ప్రమాదకరమైన ప్రాంతానికి హీరో వెహికల్లో వెళ్తుంటే.. దాని గురించి ఒక పోలీస్ అధికారికి ఇంకెవరో ఫోన్ చేసి హెచ్చరించడం, అక్కడ చాలా ప్రమాదమని.. వెంటనే వెనక్కి వచ్చేయమని చెప్పడం.. ఐతే ప్రమాదం తన నుంచి మిగతా వాళ్లకే ఉంటుందని ఆ అధికారి రివర్స్ కౌంటర్ ఇవ్వడం.. ఇలా మాస్ స్టయిల్ హీరో ఎలివేషన్‌తో సాగింది టీజర్. హీరో ఎంత వయొలెంట్ అన్నది కూడా టీజర్లో కొన్ని షాట్ల ద్వారా చెప్పకనే చెప్పారు. ఎలివేషన్ బాగున్నా సరే.. టీజర్ రొటీన్ స్టయిల్లో ఉంది. ‘హిట్’ ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న సినిమా నుంచి ఇలాంటి కంటెంట్ ప్రేక్షకులు ఊహించరు. ఏదో కొత్తగా, థ్రిల్లింగ్‌గా ఆశిస్తే.. ఇలా మాస్ చూపించారేంటి అని టీజర్ చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఐతే ఈ మధ్య నాని కొత్తదనంతో పాటు హీరోయిజం, మాస్ కూడా ఉండేలా చూసుకుంటూ రీచ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ‘సరిపోదా శనివారం’లోనూ అలాగే చేశాడు. ‘హిట్-3’ కూడా ఆ కోవలోనే నడుస్తుందేమో.