Begin typing your search above and press return to search.

హాలీవుడ్ ను చుట్టేసిన కార్చిచ్చు.. డబ్బులున్నోళ్ల ఇళ్లు దగ్థం!

వేలాది మంది కట్టుబట్టల్ని వదిలేసి ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్న పరిస్థితి. దీనికి సంపన్నులు సైతం మినహాయింపు కాదు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 7:37 AM GMT
హాలీవుడ్ ను చుట్టేసిన కార్చిచ్చు.. డబ్బులున్నోళ్ల ఇళ్లు దగ్థం!
X

ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ.. తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం అగ్రరాజ్యం అమెరికాకు అలవాటే. మరి.. వీరికి ముకుతాడు వేసేవారెవరు? అంటూ ఎవరూ కనిపించరు. అయితే.. అందరి లెక్కలు తేల్చే నేచర్ మాత్రం.. అగ్రరాజ్యానికి సవాళ్లు విసురుతూ అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో తీవ్రమైన మంచుతో అఅమెరికన్లు ఉక్కిరిబిక్కిరి చేసిన వైనం తెలిసిందే. తాజాగా కార్చిచ్చు లాస్ ఏంజెలెస్ ను షాక్ కు గురి చేస్తోంది.

సాధారణంగా కార్చిచ్చు లాంటివి సాధారణ ప్రజలను తీవ్ర అవస్థలకు గురి చేయటంతో పాటు.. తీవ్ర నష్టానికి గురి చేస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా సంపన్నుల ఇళ్లు దగ్థమవుతున్న పరిస్థితి. మంటల తీవ్రత ఎంత ఎక్కువంటే.. వేలాది మంది కట్టుబట్టల్ని వదిలేసి ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్న పరిస్థితి. దీనికి సంపన్నులు సైతం మినహాయింపు కాదు. ఈ కార్చిచ్చు ధాటికి ఆహుతైన ఇళ్లలో పలువురు హాలీవుడ్ నటులతో పాటు పలువురి సంపన్నులవి కూడా ఉండటం గమనార్హం.

తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న అగ్ని కీలలతో ఆ మంటల్లో చిక్కుకుని ఇప్పటికి ఇద్దరు మరణించారు. దీని ఎఫెక్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు తాకింది. కాలిఫోర్నియా పర్యటనకు వచ్చిన ఆయన.. అగ్నిప్రమాదం కారణంగా లాస్ ఏంజెలెస్ లోనే ఉండాల్సి వచ్చింది. బైడెన్ బస చేసి హోటల్ నుంచి కనుచూపు మేర పొగ కనిపించటం చూస్తే.. కార్చిచ్చు తీవ్రత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

రెండు వైపుల రగిలిన కార్చిచ్చు.. ఈసారి భారీ నష్టానికి గురి చేసింది. లాస్ ఏంజెలెస్ లోని ఈశాన్య ప్రాంతంలోని పర్వతాల్లో మంగళవారం అగ్గి రాజుకుంది. బలమైన గాలుల కారణంగా అది వేగంగా విస్తరించింది. అక్కడకు దగ్గర్లోని సీనియర్ సిటిజన్ల నివాస కేంద్రాల నుంచి డజన్ల కొద్దీ పెద్ద వయస్కులను వీల్ ఛైర్లు.. ఆసుపత్రి బెడ్ లపై నుంచి బయటకు తీసుకొచ్చి వీధుల్లో ఉన్న పార్కింట్ లాట్ లో ఉంచారు. వారి సమీపానికి నిప్పు కణికలు వచ్చి పడుతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా పిసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలో మరో అగ్గి రాజుకుంది. ఇది తీరం వెంట ఉన్న సెలబ్రిటీల నివాస ప్రాంతం.మంటలు భారీగా వ్యాపించటంతో చాలా మంది ప్రముఖులు.. సంపన్నులు వాహనాల్ని వదిలేసి మరీ కాలి నడకన బయట పడాల్సిన పరిసర్థితి. అతి ముఖ్యమైన పత్రాలు.. వస్తువుల్ని తీసుకున్న వారు బ్యాగులతో రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. అత్యవసర వాహనాలు రావటానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ రెండు అగ్నిప్రమాదాలతో ఆగమాగం కాగా.. ఇది సరిపోనట్లు మూడో అగ్ని ప్రమాదం మంగళవారంరాత్రి 10.30 గంటలకు మొదలైంది. దీంతో లాస్ ఏంజెలెస్ కు ఉత్తరాన ఉన్న శాన్ ఫెర్నాండో వ్యాలీలోని సిల్మర్ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. కార్చిచ్చు కారణంగా మంటల్లో కాలిపోయిన హాలీవుడ్ ప్రముఖల జాబితా పెద్దదే.

- మార్క్ హామిల్

- మాండీ మూర్

- జేమ్స్ ఉడ్స్

తదితరులు ఉన్నారు. మంటలు చుట్టుముట్టిన ప్రాంతంలో ఆడం శాండ్లర్.. బెన్ అప్లెక్.. టామ్ హ్యాంక్స్.. స్టీవెన్ స్పీల్ బర్గ్ ల ఇళ్లు ఉన్నాయి. అత్యంత సంపన్న ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ కార్చిచ్చు కారణంగా భారీ ఆస్తినష్టం వాటిల్లింది. పసిఫిక్ పాలిసాడ్స్ లో 30వేల మంది ఈ కార్చిచ్చు కారణంగా నిరాశ్రయులు కాగా.. వెయ్యి నిర్మాణాలు దెబ్బ తిన్నాయి. మరో 13వేల నిర్మాణాలకు ముప్పు పొంచి ఉంది. బెవర్లీ హిల్స్.. హాలీవుడ్ హిల్స్ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉంటుందన్న అనుమానంతో షూటింగ్ లు రద్దు చేశారు. బుధవారం లాస్ ఏంజెలెస్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇదంతా చదువుతున్నప్పుడు అనిపించేది ఒక్కటే.. ధనిక..పేద, ప్రముఖుడు.. సామాన్యుడన్న బేధాలు లేనిది ఒక్క ప్రకృతికి మాత్రమే అని.