Begin typing your search above and press return to search.

విధి ఆడిన నాట‌కం: ముగ్గురు స‌వ‌తి తండ్రుల‌తో పెరిగిన హీరో

అత‌డిని 3 సంవత్సరాల వయస్సులో తన తండ్రి విడిచిపెట్టాడు. ముగ్గురు వేర్వేరు సవతి తండ్రులతో పెరిగాడు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:00 AM GMT
విధి ఆడిన నాట‌కం: ముగ్గురు స‌వ‌తి తండ్రుల‌తో పెరిగిన హీరో
X

అత‌డిని 3 సంవత్సరాల వయస్సులో తన తండ్రి విడిచిపెట్టాడు. ముగ్గురు వేర్వేరు సవతి తండ్రులతో పెరిగాడు. అతను డైస్లెక్సిక్. హాకీ ప్లేయర్ కావాలన్న త‌న కల ఘోర ప్రమాదంతో చెదిరిపోయింది. అతడికి పెళ్ల‌యి కూతురు పుట్టగానే చనిపోయింది. భార్య కారు ప్రమాదంలో మరణించింది. ప్రాణ స్నేహితుడు అధిక మోతాదు డ్ర‌గ్స్ సేవించి మరణించాడు. త‌న‌ సోదరి లుకేమియాతో పోరాడింది.

అంగరక్షకులు లేరు.. విలాసవంతమైన ఇళ్ళు లేవు..అత‌డు ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లో నివసించాడు. టౌన్ లో తిరగడం తరచూ న‌గ‌రంలోని సబ్‌వేలో ఒక సామాన్యుడిలా ప్రయాణించడం అంటేనే అత‌డికి ఇష్టం. కానీ కాలం చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం. కాలంతోనే కొన్నిటికి ప‌రిష్కారం. అత‌డు ప్ర‌పంచంలోనే భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ఎదిగాడు. మిలియ‌నీర్ అయ్యాడు. కోరుకున్న ల‌గ్జ‌రీ లైఫ్‌ను సంపాదించుకున్నాడు. కానీ ఇప్ప‌టికీ ఎంతో ఒదిగి ఉంటాడు. ఇంత‌కీ ఎవ‌రు అత‌డు? అంటే ..ది మ్యాట్రిక్స్ హీరో కీనూ రీవ్స్ గురించే ఇదంతా.

హాలీవుడ్ స్టైలిష్ యాక్ష‌న్ హీరోగా కీనూ రీవ్స్ కి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. కీనూకి భార‌తదేశంలోను గొప్ప ఫాలోయింగ్ ఉంది. లైఫ్ లో ఎంతో ఎమోష‌న్ ని చ‌విచూసిన అత‌డు బాల్యం నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కొని చివ‌రికి గొప్ప వాడ‌య్యాడు. ఇక కీనూ రీవ్స్ ధాతృత్వం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అతడు `ది లేక్ హౌస్` చిత్రాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు త‌న సెట్స్ లో ఇద్దరు కాస్ట్యూమ్ అసిస్టెంట్ల సంభాషణను విన్నాడు. ఒకరు 20,000 డాల‌ర్లు చెల్లించకపోతే తన ఇంటిని కోల్పోతాన‌ని ఏడ‌వ‌డం చూశాడు. అదే రోజు కీను అత‌డి బ్యాంకు ఖాతాలో అవసరమైన మొత్తాన్ని జమ చేశాడు. తన కెరీర్‌లో `ది మ్యాట్రిక్స్` నుండి తన సంపాదనలో 75 మిలియన్ డాల‌ర్లు సహా పెద్ద మొత్తాలను ఆసుపత్రులకు విరాళంగా ఇచ్చాడు.

2010లో తన పుట్టినరోజున కీను ఒక బేకరీలోకి వెళ్లి ఒకే కొవ్వొత్తితో బ్రియోచీని కొని బేకరీ ముందు తిని, తనతో మాట్లాడటానికి ఆగిన వ్యక్తులకు కాఫీ అందించాడు. 1997లో కొంతమంది ఫోటోగ్రాఫ‌ర్లు కీనూని విమానాశ్ర‌యంలో చూశారు. లాస్ ఏంజెల్స్‌లోని నిరాశ్రయులైన వ్యక్తితో కలిసి ఒక ఉదయం నడిచి వెళుతూ, అతని మాటలు వింటూ కొన్ని గంటలపాటు తన స‌మ‌యాన్ని కేటాయించిన‌ట్టు గుర్తించారు.

కీనూ జీవితాన్ని ప‌రిశీలిస్తే అత‌డు ఎంతో ఒదిగి ఉంటాడు. సామాన్య జీవితాన్ని గ‌డిపాడు. జీవితంలో కొన్నిసార్లు ఎమోష‌న‌ల్ గా బ్రేక‌ప్ కి గుర‌యిన అత‌డు ఇతరులకు సహాయం చేయడానికి చాలా ఇష్టపడతాడు. కీనూ రీవ్స్ సాధ్య‌మైనంత వ‌ర‌కూ త‌న ప‌రిస‌రాల్లో ఎంద‌రికో ఎన్నో విధాలుగా స‌హ‌కారం అందించాడు. ఆర్థికంగాను ఆదుకున్నాడు. గొప్ప మ‌న‌సున్న మ‌హారాజు అని నిరూపించాడు.