హాలీవుడ్ చిహ్నానికి 100 ఏళ్లు!
ప్రపంచంలో ఎన్ని సినీ పరిశ్రమలున్నా హాలీవుడ్ సినిమాలకు పెట్టింది పేరుగా ఆచిహ్నం ఓ ప్రత్యేకమైన గుర్తింపును కలిగింది. తాజాగా అది ఏర్పాటు చేసి 100 ఏళ్లు పూర్తయింది.
By: Tupaki Desk | 10 Dec 2023 11:30 AM GMTప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన చిహ్నాల్లో లాస్ ఎంజెలీస్ లోని హాలీవుడ్ చిహ్నం ఒకటి. దీనికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచంలో ఎన్ని సినీ పరిశ్రమలున్నా హాలీవుడ్ సినిమాలకు పెట్టింది పేరుగా ఆచిహ్నం ఓ ప్రత్యేకమైన గుర్తింపును కలిగింది. తాజాగా అది ఏర్పాటు చేసి 100 ఏళ్లు పూర్తయింది. ఈ సంకేతం తొలుత 1923 డిసెంబర్ 8న హాలీవుడ్ ల్యాండ్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసారు.
13 అక్షరాలతో 30 అడుగుల వెడల్పు..43 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. 3 నుంచి 9 అడుగుల మెటల్ తో భారీ స్థంభాలతొ దాన్ని నిర్మించారు. రాత్రి సమయంలో రంగు రంగు లైట్లతో కనువిందు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. 1935 లో తొలిసారి ఆ హాలీవుడ్ సంకేతానికి మరమ్మత్తులు చేసారు. ఐదేళ్ల తర్వాత దాన్ని లాస్ ఎంజలీస్ నగరానికి విరాళంగా ఇచ్చారు. 1947 లో మరోసారి మరమ్మత్తులు చేసి ల్యాండ్ అనే పదాన్ని తొలగించారు.
అప్పటి నుంచి ఆ నగరంలోని వినోద పరిశ్రమకి చిహ్నంగా మారింది. 100 వార్షికోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆ కాలంలో మెరిసిన హాలీవుడ్ ల్యాండ్ ను తలపించేలా హాలీవుడ్ పదాన్ని లైట్లతో ప్రకాశింప జేసారు. హాలీవుడ్ అనే శబ్దం వినగానే ఆ సంకేతం అందరి మదిలో వెంటనే మెదులుతుంది. అక్కడి పరిశ్రమ నుంచి ఎలాంటి సినిమా విడుదలవుతందనేది తర్వాత సంగతి ముందు హాలీవుడ్ అక్షరాల లోగో మాత్రం కళ్ల ముందు కనిపిస్తుంది.
100 ఏళ్ల చరిత్రను కలిగింది కాబట్టే! ఆ పదానికి అంత గొప్ప ఖ్యాతి దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పరిశ్రమల నుంచి ఎన్నో రకాల సినిమాలు ఏటా రిలీజ్ అవుతుంటాయి. అవి ఏ భాషలు ..ప్రాంతానికి చెందిన సినిమాలు అయినప్పటికీ ఓ విదేశీ చిత్రం రిలీజ్ అవుతుందంటే? దాన్ని హాలీవుడ్ సినిమాగానే పరిగణిస్తుంటారు. భారత్ లో హాలీవుడ్ సినిమాల ప్రభావం ఏ రేంజ్ లో ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ బాలీవుడ్ పరిశ్రమపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మేకింగ్ పరంగా అక్కడి నుంచే స్పూర్తి పొంది సినిమాలు చేస్తున్నారు.