సమ్మె కారణంగా ఇబ్బందుల్లో వేల కోట్ల సినిమాలు
సినీ కార్మికుల సమ్మె
By: Tupaki Desk | 17 July 2023 9:35 AM GMTసినీ కార్మికుల సమ్మె అనేది రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సార్లు సినీ కార్మికులు సమ్మె చేశారు. అయితే హాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. దాదాపుగా 63 ఏళ్ల క్రితం హాలీవుడ్ కార్మికులు సమ్మె చేయడం జరిగింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వేతనాల పెంపు... జాబ్ గ్యారెంటీ విషయమై సమ్మెకు దిగారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరిగింది. కనుక భవిష్యత్తులో తమ పనికి భద్రత లేకుండా పోతుందని.. అలాగే తమ పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న సినిమా బడ్జెట్.. ఇతర అంశాలకు తగ్గట్లుగా తమ పారితోషికం పెరగలేదని వారు సమ్మె చేస్తున్నారు.
ఇప్పటికే పలు దఫాల్లో చర్చలు జరిపినా కూడా సినీ కార్మికులు తమ డిమాండ్ లు నెరవేరడం లేదు అంటూ సమ్మె కంటిన్యూ చేస్తున్నారు. ముందు ముందు సమ్మె మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విడుదల అవ్వబోతున్న సినిమాలు... షూటింగ్ దశలో ఉన్న సినిమాలు భారీ ఎత్తున నష్టపోతున్నాయి.
సమ్మె కారణంగా ఈనెల 21న విడుదల కాబోతున్న ఓపెన్ హైమర్ సినిమా కు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షో లు మొదలుకుని అన్ని విషయాల్లో కూడా సినీ కార్మికుల ప్రమేయం ఉండాల్సి ఉంది. దాంతో వారు ప్రీమియర్ షో లను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ సినిమా విడుదల విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఓపెన్ హైమర్ సినిమా మాత్రమే కాకుండా షూటింగ్ దశలో ఉన్న గ్లాడియేటర్ 2 సినిమా షూటింగ్ కు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ సమ్మెకు టామ్ క్రూజ్... జార్జీ క్లూనీ.. ఎంజెలీనా జోలీ.. ప్రియాంక చోప్రా తో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఫిల్మ్ మేకర్స్ తమ సినిమా లను విడుదల చేయడంలో.. షూట్ చేయడం లో నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
హాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె కారణంగా పలు అంతర్జాతీయ ఈవెంట్స్ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టిల్స్.. వేడుకలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.