హోంబలే టార్గెట్ అదే.. ప్రభాస్ ఓ అద్భుతం..!
ఈ సందర్భంగా హోంబలే ప్రొడక్షన్స్ నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
By: Tupaki Desk | 21 Dec 2023 6:31 AM GMTసలార్ తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించామని చెబుతున్నారు నిర్మాత విజయ్ కిరగందూర్. సలార్ అనుకున్న విధంగా చేసేందుకు మాకు ఎక్కువ సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. అందుకే సలార్ ప్రయాణం మాకు ఎప్పటికి గుర్తుండిపోయే అనుభవాన్నిచ్చిందని అన్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా సలార్. మొదటి భాగం సలార్ 1 సీజ్ ఫైర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా హోంబలే ప్రొడక్షన్స్ నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
కె.జి.ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయడం అందులో ప్రభాస్ నటించడం వల్ల సలార్ మీద తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు తగినట్టుగానే మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా నిర్మించామని అన్నారు. ఇక సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయలని అనుకున్నాం కాబట్టి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఈ సినిమా ప్రయాణం ఒక అద్భుతం. సలార్ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ సపోర్ట్, ఇక్కడి ప్రేక్షకుల సహకారం ఎంతో ఎంకరేజ్ చేసిందని అన్నారు విజయ్.
ప్రశాంత్ నీల్ కు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. ప్రభాస్ ఓ సూపర్ స్టార్ వీరి కలయికలో సినిమా అనగానే ఆడియన్స్ తో పాటుగా ఇండస్ట్రీ వర్గాలు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపాయని అన్నారు. సలార్ షూటింగ్ 90 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. సలార్ కథలో రెండు భాగాలుగా చెప్పే డ్రామా ఉంది అందుకే మొదట ఒక సినిమాగా అనుకున్న సలార్ రెండు భాగాలుగా చేశాం. కె.జి.ఎఫ్ కూడా ముందు ఒక భాగంగానే చేయాలని అనుకున్నాం కానీ కథని కుదించి చెప్పడం ఎందుకని రెండో పార్ట్ తీశాం. కాంతారా మాత్రం సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే రెండు మూడు కథలు రెడీ చేసుకున్నామని అన్నారు విజయ్ కిరగందూర్.
పదేళ్ల క్రితం నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టినప్పటికి ఇప్పటికి నా ఆలోచనలో చాలా తేడా వచ్చింది. భారతీయ సినిమా స్థాయిని మరింత ఎక్కుత్కి తీసుకెళ్లాలనేది తన ఆలోచన అని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు భాషలు అన్ని వేర్వేరుగా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే భారతీయత అని నా అభిప్రాయమన్నారు. మన కథలను ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లానే తపనతో పనిచేస్తున్నా.. తెలుగు సినిమా..కన్నడ సినిమా అని ఇక్కడే ఆగిపోవాలని అనుకోవడం లేదని అన్నారు విజయ్. ప్రేక్షకులు మాపై చూపిస్తున్న అభిమానం పెట్టుకున్న నమ్మకం మా బాధ్యత మరింత పెరిగేలా చేసింది. వాళ్లకి నచ్చేలా సినిమాలు చేయాలని మంచి కథలను ఎంచుకుంటున్నామని అన్నారు. అయితే ఈ క్రమంలో కాస్త లేట్ అవుతుందని అన్నారు విజయ్.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక దర్శకుడిగానే పరిచయమయ్యాడు. ఆ తర్వాత మంచి సన్నిహితుడిగా మారాడు. ఇప్పుడు అతను నా కుటుంబంలో ఒకడిగా మారాడని అన్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరు బిజీగా ఉండటం వల్ల రిలీజ్ ముందు ఈవెంట్ నిర్వహించలేదు అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఒక పెద్ద ఈవెంట్ చేస్తామని అన్నారు హోంబలే నిర్మాత విజయ్ కిరగందూర్.