పాపులర్ గాయకుడి పై స్టార్ హీరో దాడిలో నిజం?
ఇందులో అతడు సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ తో తన వివాదం గురించి వివరణ ఇచ్చారు.
By: Tupaki Desk | 21 Dec 2024 3:30 PM GMTయోయో హనీసింగ్ పరిచయం అవసరం లేదు. పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ప్రఖ్యాత పంజాబీ గాయకుడు. సినీరంగంలో చార్ట్ బస్టర్ పాటలతో యువతరాన్ని ఉర్రూతలూగించిన అతడు దేశ విదేశాల్లో మ్యూజిక్ కాన్సెర్టులతో అసాధారణ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం డాక్యుసిరీస్ ల ట్రెండ్ నడుస్తున్న క్రమంలో యోయో హనీసింగ్ లైఫ్ జర్నీపైనా తాజాగా డాక్యు సిరీస్ విడుదలైంది. ఇందులో అతడు సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ తో తన వివాదం గురించి వివరణ ఇచ్చారు. ఖాన్ తనపై దాడి చేసాడని అప్పట్లో ప్రచారమైంది. అయితే అది నిజం కాదని ఈ డాక్యుసిరీస్ లో యోయో హనీసింగ్ చెప్పుకొచ్చారు. తనకు తాను బుర్రపై మగ్ తో బాదుకోవడం వల్ల రక్తం కారిందని, కానీ షారూఖ్ దాడి చేసారని ప్రచారమైనట్టు అతడు చెప్పాడు. ఈ ప్రచారానికి తాను ఎంతో బాధపడ్డానని, దాదాపు తొమ్మిదేళ్ల నాటి ఘటనను డీటెయిల్డ్ గా వివరించారు.
`యోయో హనీసింగ్ : ఫేమస్` పేరుతో తాజాగా డాక్యు సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అమెరికా-చికాగోలో టీవీ షో `ఇండియాస్ రా స్టార్` చిత్రీకరణ సమయంలో అతడు `టెంప్టేషన్ టూర్` కోసం కూడా ప్రదర్శన ఇచ్చారు. ఇది ఒత్తిడితో కూడిన ప్రాజెక్ట్. అదే సమయంలో షోలు చేస్తూ ఆల్బమ్‌లు కూడా విడుదల చేస్తున్నానని దేనికీ నో చెప్పలేదని యోయో చెప్పాడు. తీవ్రమైన పని ఒత్తిడిని అనుభవించానని యోయో హనీసింగ్ చెప్పారు. షారూఖ్ తో అమెరికా టూర్ లో షో చేయలేనంత తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.. అని చెప్పాడు. కానీ నిర్వాహకులు దానికి అంగీకరించలేదు. దాంతో నేను ఒక మగ్ తీసుకుని బుర్రపై బాదుకున్నాను. కుట్లు వేసేంత గాయమైంది. కానీ షారూఖ్ నా చెంప పగుల గొట్టాడని ప్రచారమైంది. దానికి నేను చాలా కలత చెందాను! అని హనీసింగ్ వివరించారు. షారూఖ్ కి తనపై ఎంతో అభిమానం ఉందని, అతడితో గొప్ప అనుబంధం ఉందని కూడా యోయో డాక్యు సిరీస్ లో చెప్పారు.
అమెరికాలో `ఇండియాస్ రా స్టార్` షో ప్రారంభ సమయంలోనే షారూఖ్ తో అనుబంధం పెరిగిందని, కలిసి పది సార్లు అమెరికాకు వెళ్లామని హనీసింగ్ చెప్పారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013)లోని సూపర్ హిట్ పాట `లుంగీ డ్యాన్స్`కి పాడాక షారూఖ్‌తో మరింతగా బంధం పెరిగింది. ఆ తర్వాత `హ్యాపీ న్యూ ఇయర్`ని ప్రమోట్ చేయడానికి షారూఖ్ తో పాటు మ్యూజిక్ టూర్ లోను హనీసింగ్ పాల్గొన్నారు. ఆ సినిమాకి పాడకపోయినా కానీ పర్యటనలో చేరమని షారూఖ్ అడిగారట.
వరుస షోలతో అప్పటికే హనీసింగ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. షారూక్ `హ్యాపీ న్యూ ఇయర్` సినిమా ప్రచారంలో ప్రత్యేక ప్రదర్శనకు ముందు తనకు ఆరోగ్యం సహకరించలేదు. కానీ నిర్వాహక బృందం కుదరదని సీరియస్ అయ్యారు. ఆ సమయంలో చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. ఒత్తిడి తట్టుకోలేక యో యో హనీ సింగ్ తల గుండు చేయించుకున్నాడు. అయినా టోపీ పెట్టుకుని షో చేయమని నిర్వాహకులు ఒత్తిడి చేసారు. చివరికి ఇది తట్టుకోలేక చనిపోతానేమో అని భయపడ్డాడట. కాఫీ మగ్ తీసుకొని తలకు కొట్టుకున్నాడు. తనను తాను గాయపరుచుకున్నాడు. తర్వాత యో యో హనీ సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు కుట్లు వేశారు. ఇంతలోనే హనీ సింగ్ ప్రవర్తనతో షారూఖ్ ఖాన్ కలత చెందాడని, అతడిని చెంపదెబ్బ కొట్టాడని పుకార్లు వైరల్ అయ్యాయి. షారూఖ్ తో తనకు ఎప్పుడూ గొప్ప అనుబంధం ఉందని, ఆయన అలా చేయరని యోయో హనీసింగ్ డాక్యు సిరీస్ లో క్లారిటీనిచ్చారు.