Begin typing your search above and press return to search.

పుష్ప సూపర్ హిట్.. ఫ్రాంఛైజ్ ఫట్!

పుష్ప 3 ఉందని చెప్పేసినప్పటికీ.. రియాలిటీలో అలాంటి పరిస్థితి ఎంతవరకన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

By:  Tupaki Desk   |   23 Dec 2024 4:59 AM GMT
పుష్ప సూపర్ హిట్.. ఫ్రాంఛైజ్ ఫట్!
X

పుష్ప అంటే లోకల్ అనుకుంటిరా.. నేషనల్... ఇంటర్నేషనల్... అంటూ సాగే డైలాగ్ ఒకటి ఉంటుంది. నిజమే.. ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు.. బన్నీని ఎక్కువగా అభిమానించే మలయాళీలున్న కేరళలోనూ.. పక్కనే ఉండే తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్లో అంతో ఇంతో హవా చూపుతుందని అనుకున్నారు. టెస్టింగ్ లో భాగంగా హిందీలోకి వదిలారు.

ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అల్లు అర్జున్ మొదలు.. దర్శక నిర్మాతలు ఎవరూ ఊహించనంత భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కురిసిన కలెక్షన్ వర్షానికి నోట మాట రాకుండా పోయిన పరిస్థితి. దీంతో.. పుష్ప 1తో పోలిస్తే పుష్ప2ను మరింత భారీగా.. మరింత రిచ్ గా.. వైల్డ్ గా తయారు చేసి భారీ కలెక్షన్ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు వీలుగా సినిమాను విడుదల చేశారు.

‘పార్టు 2’ నిర్మాణం మొదలు సూపర్ హిట్ ఖాయమన్న భావన కలగటమే కాదు.. ఆ ఫీల్ గుడ్ తోనే సినిమా విడుదలైంది. అనుకున్నట్లే రికార్డుల మీద రికార్డులు బ్రేక్ అవుతూ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ అయిన పరిస్థితి. అయితే.. మూవీ ప్రీమియర్ షో సందర్బంగా చోటు చేసుకున్న తొక్కిసలాట.. ఆ సందర్భంగా ఒక ప్రాణం పోవటం.. మరో చిన్న పిల్లాడు ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వేదన ఒక వైపు.. మరోవైపు ఇంత జరిగిన తర్వాత దానికి ఎలా స్పందించాలో అందుకు భిన్నంగా స్పందించటం ద్వారా అల్లు అర్జున్ కొత్త సమస్యల్ని కొని తెచ్చుకున్నారని చెప్పాలి.

ఓవైపు సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని.. భారతీయ సినీ చరిత్రను తిరిగి రాసేంత విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి.. ఆ ఆనందాన్ని.. సంతోషాన్ని అస్వాదించే స్థితిలో అల్లు అర్జున్ లేకపోవటానికి కారణం.. ఆయనే. ఎలాంటి సమయాల్లో ఎలా రియాక్టు కావాలనే దానికి సంబంధించి మెచ్యూరిటీ ఆయనలో లేకపోవటం.. చివరకు ఆయన జైలు పాలు అయ్యేలా చేసింది.. అయితే.. జైలుకు వెళ్లిన గంటల్లోనే తిరిగి రావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన వ్యవహరించిన వ్యవహారశైలి.. పుష్ప ఫ్రాంచైజ్ కు చరమగీతం పాడేలా చేసిందంటున్నారు.

పుష్ప 3 ఉందని చెప్పేసినప్పటికీ.. రియాలిటీలో అలాంటి పరిస్థితి ఎంతవరకన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 3ను తెరకెక్కించేందుకు దర్శకుడు సుకుమార్ కానీ.. నిర్మాతలు కానీ అంత ఆసక్తిగా లేరని చెబుతున్నారు. ఒకవేళ.. అయితే గియితే రెండు.. మూడేళ్లు బ్రేక్ తీసుకొని మళ్లీ ఆ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తారేమో కానీ.. ఇప్పటికి ఇప్పుడు మాత్రం షట్టర్ క్లోజ్ చేయటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదెంత వరకు నిజమన్నది రానున్న రోజుల్లో తేలనుందని చెప్పాలి.