Begin typing your search above and press return to search.

స్టార్ ప్రొడ్యూసర్ కు ఎమ్మెల్యే టికెట్‌ ఎలా మిస్సయింది?

మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో బన్నీ వాస్ పాలకొల్లు నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది.

By:  Tupaki Desk   |   20 July 2024 5:07 PM GMT
స్టార్ ప్రొడ్యూసర్ కు ఎమ్మెల్యే టికెట్‌ ఎలా మిస్సయింది?
X

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఓవైపు గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చూసుకుంటూనే, మరోవైపు జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్ తో చిత్రాలను రూపొందిస్తూ మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. అయితే బన్నీ వాసుకు సినిమాలతో పాటుగా రాజకీయాలంటే ఆసక్తి ఉందనే సంగతి సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఆయన గతంలో 'ప్రజారాజ్యం' పార్టీకి, ఆ తర్వాత 'జనసేన' పార్టీ కోసం వర్క్ చేసారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో బన్నీ వాస్ పాలకొల్లు నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. కానీ అలా జరగలేదు. ఇదే విషయం మీద నిర్మాత తాజాగా మాట్లాడారు.

'ఆయ్‌' మూవీ ప్రెస్ మీట్ లో 'ఎమ్మెల్యే టికెట్‌ గురించి పవన్‌ కల్యాణ్‌ను అడిగారా?' అని ప్రశ్నించగా.. 2019లోనే పోటీ చేయమని అడిగారని బన్నీ వాస్ చెప్పారు. ''అల్లు అరవింద్ నాకు చాలా క్లారిటీగా చెప్పారు. '2029 వరకూ కంపెనీని మొత్తం ట్రైన్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకున్నా నేను ఏమీ అనను. కావాలంటే ఎలక్షన్ ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. కానీ ఈలోపు వెళ్తే మాత్రం కాళ్ళు విరగ్గొడతాను' అన్నారు. అలా అని కాదు కానీ, నాకు కూడా అది న్యాయం అనిపించలేదు. ఈ కంపెనీ గాడిలో పడింది అన్నప్పుడు డెఫినిట్ గా పాలిటిక్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటాను'' అని వివరించారు.

''2019లోనే పాలకొల్లు నుంచి పవన్ కళ్యాణ్ నన్ను పోటీ చేయమన్నారు. ‘నేను చిన్న పిల్లోడిని కదా సార్’ అని అన్నాను. 'నువ్వు అలా ఆలోచించొద్దు. ఓడిపోయినా సరే ఫర్వాలేదు. నువ్వు ఒక కాండిడేట్ వి అవుతావు. భయపడకు. ఏదేమైనా ధైర్యంగా ముందుకి అడుగేయ్‌' అని చెప్పారు. కానీ అప్పుడు నాకు నిజంగా ధైర్యం సరిపోలేదు. 2024 ఎన్నికలకు ముందు ఆయన్ని కలిసి మాట్లాడినప్పుడు.. 'ఏంటి ఇంకా టైమ్‌ తీసుకుంటావా?' అనే మాట అన్నారు. 'అల్లు అరవింద్‌ గారితో మాట్లాడి చెబుతా సార్' అని అనగానే ఆయనకు అర్థమైపోయింది. 'నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకునే రోజున నా దగ్గరకురా' అని అన్నారు'' అని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీకి సభలు, రోడ్ షోలు ఆర్గజైజ్ చేసినట్లుగా వాసు నాలుగేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పాలకొల్లు నుంచి పోటీ చేయమని పవన్ కళ్యాణ్ అడిగారని అప్పుడే చెప్పారు. నీలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలి.. గెలుపు ఓటములు పట్టించుకోకుండా పోటీ చేయమని అన్నారని తెలిపారు. అయితే ఇంకో వ్యక్తి తనకంటే రైట్ క్యాండిడేట్ అని చెప్పానని.. 'మార్నింగ్ లోపు ఆయన వస్తే ఓకే, లేకపోతే నువ్వే నిలబడుతున్నావ్' అని పవన్ కళ్యాణ్ ఆర్డర్ వేసినట్లుగా చెప్పారని బన్నీ వాస్ వివరించారు. 'కోట బొమ్మాళి' సినిమా ప్రెస్ మీట్ లోనూ పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే 2024లో జనసేన పార్టీ తరపున తప్పకుండా వర్క్ చేస్తానని తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే, గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ లో 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతిరోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన 'ఆయ్' చిత్రాన్ని ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'తండేల్' లాంటి పెద్ద సినిమా కూడా రాబోతోంది. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. 75 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ భారీ సినిమా చేయనున్నారు.