OTT Review: బాలీవుడ్ బ్యూటీ భూమి 'భక్షక్' ఎలా ఉందంటే?
బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కు పుల్ కిత్ దర్శకత్వం వహించారు.
By: Tupaki Desk | 10 Feb 2024 5:13 PM GMTప్రేక్షకులను ఆకట్టుకోడానికి ఓటీటీలు సంస్థలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. థియేట్రికల్ రిలీజులకు పోటీగా సరికొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో మిగతా ఓటీటీల కంటే కాస్త ముందుండే ప్రముఖ డిజిటల్ వేదిక నెట్ ఫ్లిక్స్.. ఈవారం 'భక్షక్' అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రాన్ని స్ట్రీమింగ్ కు పెట్టింది. బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కు పుల్ కిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
'భక్షక్' కథేంటంటే.. పట్నాలోని మునావర్ పూర్ లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసే వైశాలి (భూమి పెడ్నేకర్).. తన యూట్యూబ్ ఛానల్ లో స్థానిక సంఘటనలపై వార్తలను ప్రసారం చేస్తూ ఉంటుంది. అదే ప్రాంతంలో బన్సీలాల్ (ఆదిత్య శ్రీవాత్సవ) అనాథ బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తుంటారు. అయితే అక్కడ పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని రిపోర్ట్ చేసినా, పోలీసులు పెద్దగా పట్టించుకోరు. బన్సీలాల్ కు రాజకీయ నాయకులతో ఉన్న సత్సంబంధాల కారణంగా దానిపై చర్యలు తీసుకోడానికి ఎవరూ సాహసించరు. హోమ్ లో జరిగే అకృత్యాల గురించి తెలుసుకున్న వైశాలి ఏం చేసింది? బాలికలను రక్షించి బన్సీలాల్ కు శిక్షపడేలా చేసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నేటి సమాజంలో తల్లిదండ్రులను కోల్పోయి దుర్భర జీవితాన్ని అనాథలు ఎందరో ఉన్నారు. అలాంటివారిని చేరదీసి బలవంతంగా వ్యభిచారం చేయించడం, హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం వంటి ఘటనలు మనం తరచుగా వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి ఉదంతాలను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సినిమానే ‘భక్షక్’. బలమైన కథ కథనాలు ఉంటే చాలు, స్టార్ క్యాస్టింగ్ అవసరం లేదని నిరూపించే చిత్రాల్లో ఇదొకటి.
ఎక్కడా కమర్షియల్ హంగుల జోలికిపోకుండా, ప్రతీ సన్నివేశాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఒక ఎమోషనల్ డ్రామాగా కథను నడిపించారు దర్శకుడు పులకిత్. దీని వల్ల స్టోరీ చాలా స్లోగా ముందుకు నడుస్తోందనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే ఉన్నప్పటికీ, ఏం జరగబోతుందో అనే ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. నేటి సమాజంలో జరుగుతున్న దారుణాలపై స్పందించడానికి మనకు సమయం ఉండదు.. టీవీలు, సోషల్ మీడియాలో వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ మసాలా వార్తలను చూడటానికి మాత్రమే టైమ్ ఉంటుంది అంటూ వైశాలి పాత్రతో చెప్పించే సన్నివేశం మెప్పిస్తుంది. అయితే తెలిసిన కథే అవ్వడం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో ఆశించే ట్విస్టులు పెద్దగా లేకపోవడం ప్రధాన మైనస్ గా చెప్పాలి.
కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలు విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్. ఇప్పుడు 'భక్షక్' వంటి మెసేజ్ ఓరియెంటెడ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. జర్నలిస్ట్ వైశాలి పాత్రలో భూమి ఒదిగిపోయింది. సాటి మహిళల రక్షణ కోసం పోరాడే యువతిగా మెప్పించింది. అలానే సంజయ్ మిశ్రా, సాయి తమంకర్, ఆదిత్య శ్రీవాత్సవ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్ గా ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిన ఆడియన్స్ కు 'భక్షక్' సినిమా నచ్చుతుంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగులోనూ అందుబాటులో ఉంది కాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసెయ్యొచ్చు.