Begin typing your search above and press return to search.

ఇలా అయితే ఎలా అఖిల్?

అయితే అఖిల్ మాత్రం సినిమాల కంటే క్రికెట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుండటంపై కొందరు అభిమానులు నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 March 2024 9:14 AM GMT
ఇలా అయితే ఎలా అఖిల్?
X

అక్కినేని మూడో తరం నట వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు యూత్ కింగ్ అఖిల్. హీరోగా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ తన రేంజ్ కు తగ్గ విజయాన్ని అందుకోలేకపోయారు. ఇప్పటి వరకూ ఐదు చిత్రాలు చేసినా, ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా సాధించలేకపోయారు. సినిమాల కోసం తన శక్తినంతా ధారపోస్తున్నా, సరైన సక్సెస్ మాత్రం రుచి చూడలేకపోతున్నారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయంటే, అది దురదృష్టమనే అనుకోవాలి. అఖిల్ నెక్స్ట్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాలని, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అఖిల్ మాత్రం సినిమాల కంటే క్రికెట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుండటంపై కొందరు అభిమానులు నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది.

అఖిల్ అక్కినేని చివరగా గతేడాది ఏప్రిల్‌లో 'ఏజెంట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక అప్పటి నుంచి అఖిల్ పూర్తిగా ఆఫ్ లైన్ లోకి వెళ్ళిపోయారు. దగ్గర దగ్గర ఏడాది కావొస్తున్నా, ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ లేదు. అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు కానీ, ఎలాంటి అనౌన్స్ మెంట్ రావడంలేదు. పోనీ 'ఏజెంట్' ఓటీటీలోకి వస్తేనన్నా కొన్నాళ్ళు ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటారు అనుకుంటే, ఆ మూవీ ఎప్పుడు డిజిటల్ వేదిక మీదకు వస్తుందనేది ఎవరికీ తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ ఈ మధ్య సినిమా సెట్స్‌లో కాకుండా, క్రికెట్ గ్రౌండ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు అక్కినేని అభిమానులకు మింగుడు పడటం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ టీమ్ కి అఖిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన సారథ్యంలో జట్టును రెండుసార్లు విజేతగా నిలిపారు. ఇటీవలే దుబాయ్ వేదికగా ప్రారంభమైన సీసీఎల్ కొత్త సీజన్ లోనూ అక్కినేని వారసుడు పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు లీగ్ మ్యాచుల్లో గెలిచి, మూడో మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదంతా సంతోషించదగ్గదే కానీ, ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే వారు అఖిల్ ను గ్రౌండ్ లో ఒక క్రికెటర్ గా కాకుండా, బిగ్ స్క్రీన్‌ మీద ''స్టార్ హీరో''గా చూడాలని కోరుకుంటున్నారు. అందుకే అఖిల్ క్రికెట్ టోర్నమెంట్‌లో సిక్సులు, ఫోర్లు కొట్టి టీమ్ ని గెలిపిస్తున్నా వారు మాత్రం హ్యాపీగా లేరని 'ఎక్స్' లో కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది.

అఖిల్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పటి నుంచే దాంట్లో శిక్షణ తీసుకొని అన్ని మెళకువలు నేర్చుకున్నారు. అతని బ్యాటింగ్ బౌలింగ్ స్కిల్స్‌ ఎలా ఉంటాయనేది మనం గతంలో అనేక సీసీఎల్ టోర్నీలలో చూశాం. అయితే తన ఫేవరేట్ గేమ్ ను ఆస్వాదించడంలో తప్పులేదు కానీ.. అతను ఇప్పుడు ఒక హీరో కాబట్టి, మొదటి ప్రాధాన్యత సినిమాలకే ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ మంచి మంచి చిత్రాలను అందించాలని.. కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలని ఆశిస్తున్నారు.

నిజానికి అఖిల్ తన ఫస్ట్ మూవీ నుంచే ఎంతో కష్టపడుతూ వస్తున్నారు కానీ, దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోయారు. నడవడం, మాట్లాడటం రాని వయసులోనే 'సిసింద్రీ'గా తెరంగేట్రం చేసిన యూత్ కింగ్.. తమ కుటుంబానికి ఎప్పటికీ మెమరబుల్ నిలిచిపోయే 'మనం' మూవీతో ఆకట్టుకున్నారు. 2015లో 'అఖిల్' సినిమాతో హీరోగా పరిచయమై, డెబ్యూతోనే డిజాస్టర్ చవిచూశారు. ఆ తర్వాత 'హలో' అంటూ పలకరించి యావరేజ్ రిజల్ట్ రాబట్టారు. ఇదే క్రమంలో వచ్చిన 'మిస్టర్ మజ్ను' నిరాశ పరిచింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ మాత్రం 50 కోట్ల గ్రాస్ రాబట్టి, సక్సెస్ అందించింది.

'ఏజెంట్' ప్లాప్ తర్వాత గ్యాప్ తీసుకున్న అఖిల్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి 'ధీర' అనే టైటిల్ కూడా ప్రచారంలో వుంది. ఇప్పుడు అఖిల్ మెయింటైన్ చేస్తున్న లుక్ కూడా ఆ సినిమా కోసమే అంటున్నారు. ఏదేమైనా అక్కినేని యువ హీరో త్వరలోనే న్యూ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి, షూటింగ్ ప్రారంభించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈసారి బ్లాక్ బస్టర్ తో తన సత్తా ఏంటో చూపిస్తాడని నమ్ముతున్నారు.