చిరు కెరీర్‌కి సీనియర్ హీరో సాయం
1982-1986 వరకు సూపర్ స్టార్ కృష్ణ పిచ్చి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో.
By: Tupaki Desk | 4 Aug 2024 7:17 AM GMTఎన్టీఆర్ - ఏఎన్నార్ లాంటి ఉద్ధండులు ఉన్న పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఘట్టమనేని కృష్ణ ఇంతింతై సూపర్ స్టార్ గా ఎదిగిన వైనం నేటితరం ఔత్సాహిక నటీనటులకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆయన గట్స్.. డేరింగ్ డెసిషన్స్.. ఫిలింమేకింగ్ శైలి.. టెక్నికల్ గా అడ్వాన్స్ డ్ థింకింగ్ .. ఇవన్నీ తెలుగు సినిమా ఎదుగుదలకు సహకరించాయని సీనియర్ సినీజర్నలిస్టులు విశ్లేషించారు.
1982-1986 వరకు సూపర్ స్టార్ కృష్ణ పిచ్చి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అసాధారణ స్టార్‌డమ్ కారణంగా తెలుగు సినిమాల్లో నంబర్ 1 స్టార్‌గా కొనసాగారు. ఆయన కంటే సీనియర్లలో ఎన్టీఆర్ సినిమాల నుండి రిటైర్ అయ్యి రాజకీయాల్లోకి ప్రవేశించిన పరివర్తన దశలో.. అప్పటికి చిరంజీవి వర్ధమాన స్టార్‌గా ఉన్నారు. ఆ సమయంలో కృష్ణ ఎక్కడికి వెళ్లినా హోరెత్తిపోయేది. మాస్ లో ఫాలోయింగ్ అలా ఉండేది.
చిరంజీవి ఎదిగే క్రమంలో కృష్ణ ఏజ్ కూడా పెరుగుతూ వచ్చింది. అదే క్రమంలో కెరీర్ స్పీడ్ నెమ్మదించింది. ఆ సమయంలో బాలలు ఎదిగే క్రమంలో యుక్తవయసు వచ్చేప్పటికి చిరంజీవి స్టార్ గా అవతరిస్తున్నారు. ఆ సమయంలోనే కృష్ణ ఫ్యాన్స్ కూడా చిరంజీవిని అభిమానించడం మొదలైంది. అప్పట్లో చిరంజీవి హార్డ్ వర్క్, డ్యాన్సింగ్ స్కిల్ గురించి కృష్ణ బహిరంగంగానే ప్రశంసించారు. సూపర్ స్టార్ కృష్ణ అప్పటికి వర్ధమాన నటుడుగా ఉన్న చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అదే సమయంలో ఈ కథ చిరంజీవికి సూటవుతుందంటూ కృష్ణ తన నిర్మాతలను చిరంజీవి వద్దకు పంపారు. యాక్షన్ సీన్స్ సహజంగా చేస్తున్నాడు.. డ్యాన్సులు బాగా చేస్తున్నాడు అంటూ చిరు ప్రతిభను కొనియాడారు కృష్ణ. ఆ తరవాత నిర్మాతలు చిరుకి ఆ కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. కృష్ణ గారు చేసిన ఆ ఒక్క సహాయం చిరంజీవి కెరీర్ నే మలుపు తిప్పింది.
యువకుడైన చిరు కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిచింది ఖైదీ. వాస్తవానికి ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటించాల్సింది. కానీ అప్పటికి ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజుల్లో సంవత్సరానికి డజను సినిమాలు చేసిన స్టార్ గనుక `ఖైదీ`(1983) లాంటి యాక్షన్ చిత్రానికి కాల్షీట్లు కేటాయించలేకపోయారు. పైగా ఇలాంటి యాక్షన్ కథ యువకుడైన చిరంజీవికి చెబితే మంచిదని నిర్మాతలకు సూచించారు కృష్ణ. అలా తన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలో నటించే అవకాశం చిరంజీవికి కలిగింది. ఖైదీ చిరంజీవికి మాస్ లో భారీ ఫాలోయింగ్ ని పెంచిన చిత్రం. దీనికి పరుచూరి బ్రదర్స్ రచయితలు. మిగిలినది చరిత్ర.
ఆసక్తికరంగా వెంకటేష్ నటించిన `కలియుగ పాండవులు` కూడా కృష్ణతో చేయవలసి ఉంది. అయితే కృష్ణ తన కాల్షీట్లను కేటాయించలేకపోయినందున అది వెంకటేష్ తొలి చిత్రంగా మారింది. తెలుగు సినిమా చూసిన బిగ్గెస్ట్ మాస్ స్టార్స్ సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి. ANR, శోభన్ బాబు కూడా పెద్ద స్టార్లు.. కానీ వారు ఎక్కువగా మహిళలు, కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించారు. క్లాస్ స్టార్టుగా ముద్రపడింది వీళ్లకు.