Begin typing your search above and press return to search.

69వ‌ జాతీయ అవార్డుల రేసులోకి RRR ప్ర‌వేశం ఎలా?

ఆ లెక్క‌న చూస్తే ఆర్.ఆర్.ఆర్ చిత్రం 2022లో విడుద‌లైంది. కానీ ఈ సినిమా ఇప్పుడు 69వ జాతీయ అవార్డుల రేసులో నిలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 10:49 AM GMT
69వ‌ జాతీయ అవార్డుల రేసులోకి RRR ప్ర‌వేశం ఎలా?
X

క‌రోనా భ‌యాలేవీ లేకుండా సినీప‌రిశ్ర‌మ‌లు నిశ్చింత‌గా ఉన్నాయి. ఇప్పుడు అవార్డుల కార్య‌క్ర‌మాలు స‌జావుగానే సాగుతున్నాయి. నిజానికి కోవిడ్ 19 ప్ర‌భావం జాతీయ అవార్డుల‌పైనా ప‌డిన సంగ‌తి తెలిసిందే. 68వ జాతీయ అవార్డులు క‌రోనా విల‌యం వ‌ల్ల ఆల‌స్య‌మ‌య్యాయి. 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ భారతీయ చలనచిత్రాల్లో 2020లో విడుద‌లైన‌ ఉత్తమ చిత్రాలను క‌ళాకారుల‌ను సత్కరించింది. ఏడాదిలో రిలీజ‌య్యే సినిమాల‌కు అందించే అవార్డుల కార్యక్రమమిది. వాస్తవానికి 68వ జాతీయ అవార్డుల వేడుక 3 మే 2021న జరగాల్సి ఉండ‌గా COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. విజేతలను 22 జూలై 2022న ప్రకటించారు. అవార్డులను 30 సెప్టెంబర్ 2022న అందించారు.

గ‌త ఏడాది 2020లో రిలీజైన చిత్రాల‌కు జాతీయ అవార్డులు అందించారు. ఇప్పుడు 2021లో రిలీజైన చిత్రాల‌కు మాత్ర‌మే జాతీయ అవార్డులు అందించాలి. ఆ లెక్క‌న చూస్తే ఆర్.ఆర్.ఆర్ చిత్రం 2022లో విడుద‌లైంది. కానీ ఈ సినిమా ఇప్పుడు 69వ జాతీయ అవార్డుల రేసులో నిలుస్తోంది. ఇది ఎలా సాధ్యం? అంటూ కొంద‌రు ఆరాలు తీస్తున్నారు. అయితే దీనికి స‌ముచిత‌మైన వివ‌ర‌ణ కూడా తుపాకి అందిస్తోంది.

RRR 2022లో విడుదలైనప్పటికీ 2021 నవంబర్ 26 న U/A సర్టిఫికేట్ మంజూరు అయింది. ఈ చిత్రం 69వ జాతీయ అవార్డుల జాబితాలోకి రావడానికి కారణం ఇదే. 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా ధృవీకరించబడిన ఫీచర్ .. నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు ఫిల్మ్ ఈసారి జాతీయ‌ అవార్డ్ ల‌కు అర్హం. ఆస‌క్తిక‌రంగా ఆర్.ఆర్.ఆర్ స్టార్లు జాతీయ అవార్డుల్లో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఉత్త‌మ న‌టుడు కేట‌గిరీలో పోటీప‌డ‌నున్నారు. మ‌రోవైపు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి పేరు కూడా వినిపిస్తోంది.

అయితే RRR లో తన కంపోజిషన్లకు MM కీరవాణి కూడా ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డును గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. RRR నుండి 'నాటు నాటు..' ప్ర‌పంచాన్ని ఉర్రూత‌లూగించింది. ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్స్ 2023లో ఉత్తమ పాటగా నిలిచింది. ఇప్పుడు జాతీయ అవార్డును గెలుచుకోవ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది.