Begin typing your search above and press return to search.

‘వార్ 2’ కు బ్రేక్.. కారణమేంటంటే?

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతున్న వార్ 2 సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   11 March 2025 1:28 PM IST
‘వార్ 2’ కు బ్రేక్.. కారణమేంటంటే?
X

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతున్న వార్ 2 సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ అనుకోని కారణాలతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇక అసలు కారణం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా కోసం ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్ లో ఒక భారీ పాటను ప్లాన్ చేశారు. 500 మంది డాన్సర్లతో గ్రాండ్ గా తెరకెక్కించేందుకు దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం. అయితే, ఈ పాట కోసం హృతిక్ రోషన్ ప్రాక్టీస్ చేస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం హృతిక్ రోషన్ కు రిహార్సల్స్ సమయంలో గాయమైంది. దీంతో షూటింగ్ షెడ్యూల్ కాస్త అస్తవ్యస్తంగా మారింది.

గాయానికి గురైన హృతిక్ కి వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ దశ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అయితే, హృతిక్ గాయంతో షూటింగ్ షెడ్యూల్స్ కు మళ్లీ మార్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు వార్ 2 విడుదల తేదీ విషయంలో సరైన క్లారిటీ లేదు. ఆగస్టు 14 అంటున్నారు కానీ ఇంకా వర్క్ చాలా పెండింగ్ ఉందట.

సరైన ప్లాన్ లేకపోవడం, అలాగే రీ షూట్స్ చేయడం వల్ల కూడా ఎన్టీఆర్ డేట్స్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. అతని తదుపరి సినిమాలకు కూడా ఇబ్బందిగా మారింది.

ఇక రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేయలేదు కానీ తాజా ఘటనతో ఆలస్యం తప్పదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తదుపరి సినిమా కోసం మరో ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడంతో, ఈ ఆలస్యం ఇతర ప్రాజెక్టులపై ప్రభావం చూపించే అవకాశముంది.

వార్ 2 అభిమానుల్లో ఈ విరామం నిరాశ కలిగించింది. హృతిక్ రోషన్ గతంలో కూడా ఫిజికల్ ట్రైనింగ్ సమయంలో గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. యాక్షన్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించే ఆయనకు ఇలాంటి సిట్యువేషన్లు కొత్తేమీ కాదు. అయితే, ఈసారి రికవరీ కోసం నెల రోజుల గడువు పడటం ప్రొడక్షన్ టైమ్ లైన్ పై ప్రభావం చూపించేలా ఉంది.

ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా షూటింగ్ పున: ప్రారంభంపై క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా YRF స్పై యూనివర్స్ లో కీలకమైన భాగం. అందుకే, సినిమా ఏ చిన్న వాయిదా పడినా అనేక ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. అనుకున్న టైమ్ కు షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకులకు ఫాస్ట్ గా సినిమాలు అందించే ఎన్టీఆర్ కూడా ఈ ఆలస్యంపై అసంతృప్తిగా ఉన్నట్లు టాక్. మరి హృతిక్ రికవరీ పూర్తయిన తర్వాత షూటింగ్ ఎప్పుడు తిరిగి మొదలవుతుందో చూడాలి.