51 వయసులో ఆరోగ్యం కోసం హృతిక్ టిప్స్
గ్రీక్ గాడ్‌గా హృదయాలను గెలుచుకున్నారు హృతిక్ రోషన్. నేటితరం జిమ్‌లో కుస్తీలు పట్టడం వెనక అతడే ఒక స్ఫూర్తి.
By: Tupaki Desk | 14 Jan 2025 7:30 PM GMTగ్రీక్ గాడ్‌గా హృదయాలను గెలుచుకున్నారు హృతిక్ రోషన్. నేటితరం జిమ్‌లో కుస్తీలు పట్టడం వెనక అతడే ఒక స్ఫూర్తి. యువకులు హృతిక్ లా మారాలని కలలు కంటారు. దానికోసం నిరంతరం జిమ్‌లో చాలా శ్రమిస్తారు. కానీ అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. హృతిక్ రోజుకు రెండున్నర గంటలు తప్పనిసరిగా జిమ్ లో వ్యాయామాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. సుశిక్షితుడైన కోచ్ సమక్షంలో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు చాలా ఖర్చు చేస్తూ, జీవితాంతం హార్డ్ గా శ్రమిస్తూనే ఉన్నారు.
అయితే 51 ఏళ్ల వయసులోను ఫిట్ గా ఉండటమెలానో అతడు కొన్ని టిప్స్ ఇచ్చాడు. హృతిక్ రోషన్ తన ఫిట్‌నెస్ దినచర్యలో నడక, ఈత, జిమ్ వ్యాయామాలను అనుసరిస్తాడు. అతడు తన ఆకట్టుకునే శరీరాన్ని కాపాడుకోవడానికి కఠినమైన జిమ్ దినచర్యను అనుసరించడమే కాకుండా, విశ్రాంతి తీసుకోవడానికి పూల్‌లో ఈత కొడతాడు. తన మనస్సును తేలికపరుచుకోవడానికి బీచ్ నడకలకు కూడా వెళ్తాడు. తన వ్యాయామ దినచర్యలో భాగంగా నడక, ఈత, జిమ్ తప్పనిసరి. తద్వారా పూర్తి శరీర బలాన్ని పెంచడం, ఎనర్జీని మెరుగుపరచడం, కేలరీలను బర్న్ చేయడంపై దృష్టి పెడతాడు. అతడు తన ఫాలోవర్స్ కి అత్యంత ప్రేరణాత్మక సందేశాన్ని కూడా షేర్ చేసాడు. అభిమానులు హృతిక్ రోషన్ బ్రాండ్ HRX ద్వారా ఇన్ స్టాలో షేర్ చేసిన వ్యాయామ ప్రేరణ వీడియోను వైరల్ చేస్తున్నారు. డ్రీమ్ బాడీని జీవితంలో ఒక్కసారి అయినా సాధించాలని హృతిక్ ఈ వీడియోలో కోరాడు.
ఒకే జీవితం, ఒకే శరీరం, ఇది మీ స్వంతం... జీవితంలో ఒక్కసారి అయినా ఇదీ నా శరీరం అని గర్వపడేలా చేయండి అని పిలుపునిచ్చాడు. మీకు ఏమి కావాలో, ఏమి వద్దు అనేది మీకు ఎప్పటికీ తెలియదని అర్థమవుతుంది. ఒకే ఒక కారణం - ఒకే జీవితం, ఒకే శరీరం, ఇది మీ స్వంతం. దాని కోసం మీరు చేయగలిగినదంతా ఒకసారి చేయండి. ఒకసారి మీ ఉత్తమ శరీరాన్ని పొందండి.. అని రాసాడు.
నేను లావుగా ఉన్నాను, బొద్దుగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను.. అది చాలా బాగుంది అని చెబుతారు. మీకు అనుభవంతో చెబుతున్నా ఈ ఒక్కసారికి కసరత్తులు చేయండి! అని తనవంతుగా యువతరంలో స్ఫూర్తిని నింపాడు హృతిక్. ఈ వీడియో ది బెస్ట్ అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. హృతిక్ రోషన్ తదుపరి ఎన్టీఆర్ తో కలిసి వార్ 2లో నటించాడు. ఈ ఏడాది ఈ సినిమా రిలీజవుతుంది. తదుపరి క్రిష్ 4లో నటించే వీలుంది.