పర్మిషన్ తీసుకొని మరీ అందరికి పంచ్ లేసిన ఆది - 1
చిరంజీవి టాలెంట్ గురించి చెప్పిన హైపర్ ఆది.. 'ఈ జనరేషన్ యంగ్ హీరోలంతా డ్యాన్స్ ఇరగదీస్తారని.. కానీ, ఆ డ్యాన్స్ లో ఒక మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి
By: Tupaki Desk | 7 Aug 2023 3:56 AM GMTఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భోళా శంకర్ ప్రిరిలీజ్ ఫంక్షన్ ఫూర్తైంది. ఈ వారాంతంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చేస్తోంది. సంక్రాంతి వేళ వచ్చిన వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటించిన మూవీ ఇదే. ఈ సినిమా వేడుక వేళ.. ఎంత మంది మాట్లాడినా.. హైపర్ ఆది మాట్లాడిన మాటలు మెగా అభిమానుల కు గూస్ బంప్స్ తెచ్చి పెట్టాయి. ప్రతి మాటలోనూ మెగాస్టార్ మీద తనకెంత అభిమానం ఉందో తెలిపేలా చేసిన అతడు.. ఈసారి మరో పని కూడా చేశారు.
చిరంజీవి ని టార్గెట్ చేసే వారికి.. చిరు ను విమర్శించటమే పనిగా పెట్టుకున్న వారందరికి హోల్ సేల్ గా ఇచ్చి పడేశాడు. మెగాస్టార్ ఎదుట నిలబడి.. ఆయనకు జరిగిన అవమానాలు.. ఆయన ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ.. వాటిని మెగాస్టార్ ఎదుర్కొన్న తీరు గురించి చెప్పేసిన వైనం అందరిని ఆకట్టుకునేలా చేసింది. అన్నయ్య కొంచెం టైం తీసుకుంటానంటూ దాదాపు పన్నెండు నిమిషాల పాటు మాట్లాడిన హైపర్ ఆది మాటలకు మెగా అభిమానులంతా ఫిదా అయ్యారు. కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటేనే.. కొందరు మనల్ని ఏమనకుండా ఉంటారంటూ మొదలెట్టిన ఆది.. ఎక్కడా ఆగలేదు.
"ఒక సాధారణ మధ్యతరగి కుటుంబానికి చెందిన ఒక యువకుడు.. నేను సైనికుడ్ని అవుతానంటూ ఒక యుద్ధ భూమికి బయలుదేరాడు. ఆ యుద్ధ భూమిలో కండలు తిరిగిన సైనికులు చాలామంది ఉన్నారు. వాళ్లు యుద్దం చేస్తున్నారు.. గెలుస్తున్నారు.. ఈయన చూస్తున్నారు. ఒకరోజు ఈయనకు యుద్ధం చేసే అవకాశం వచ్చింది. వాళ్లందరి కళ్లు చెదిరేలా యుద్ధం చేశాడు. అందరూ కలిసి ఆయన్ను సైన్యాధిపతిగా ప్రకటించారు. ఒక ముప్ఫై ఏళ్లు ఆ యుద్ధ భూమిని ఏలారు. ఇక్కడ యుద్ధభూమి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ 30 ఏళ్లు యుద్ధభూమిని ఏలిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య ఇక్కడ ఇంత మంది సినీ సైనికుల్ని తయారు చేసి సేనాని అయితే.. అక్కడ తమ్ముడు జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యాడు. మామూలుగా మనం ఎవరి గురైంచైనా మాట్లాడేటప్పుడు వినేవాళ్లకు గూస్ బంప్స్ వస్తాయి. కానీ.. మాట్లాడే వాడికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయంటూ.. వాడు మాట్లాడేది మెగాస్టార్ చిరంజీవి గురించే" అంటూ మాట్లాడిన మాటలకు అభిమానులు మెగానందానికి గురయ్యారు.
సాధారణంగా హీరోల కు ఫ్యాన్స్ ఉంటారని.. కానీ చిరంజీవికి మాత్రం హీరోలే ఫ్యాన్స్ గా ఉంటారన్నారు. ఆస్తులు సంపాదించటం కన్నా.. అభిమానుల్ని సంపాదించుకోవటమే లక్ష్యంగా పెట్టుకొని.. ఎదిగిన హీరో మెగాస్టార్ అన్న హైపర్ ఆది.. "అటు పాత తరానికి.. ఇటు కొత్త తరానికి వారధి. ఇన్ని కోట్ల మంది అభిమానుల కు సారధి మన మెగాస్టార్. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో చెప్పలేను కానీ.. ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ ఒకరు మాత్రం కచ్ఛితంగా ఉంటారు. ఇది ష్యూర్. నా వరకు మెగాస్టార్ చిరంజీవి.. సచిన్ టెండూల్కర్ ఇద్దరు ఒక్కటే. సచిన్ ను ఎవరైనా విమర్శిస్తే నోటితో సమాధానం చెప్పడు. బ్యాట్ తో సమాధానం చెబుతాడు. అలానే చిరంజీవిని ఎవరైనా విమర్శిస్తే.. మాటలతో సమాధానం చెప్పడు. మళ్లీ సినిమాతోనే సమాధానం చెబుతారు. ఆచార్య సినిమాపై విమర్శలు వచ్చాయి. వాల్తేరు వీరయ్యతో వాళ్లందరికి సమాధానాలు వచ్చాయ్. అది మెగాస్టార్’ అంటూ చెప్పుకొచ్చారు.
చిరంజీవి టాలెంట్ గురించి చెప్పిన హైపర్ ఆది.. 'ఈ జనరేషన్ యంగ్ హీరోలంతా డ్యాన్స్ ఇరగదీస్తారని.. కానీ, ఆ డ్యాన్స్ లో ఒక మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి. ఈ జనరేషన్ లో ఫైట్స్ లో హీరోలంతా కుమ్మేస్తారు. కానీ.. అందులో మార్క్ సెట్ చేసింది మెగాస్టార్. ఈ జనరేషన్ లో రెమ్యునరేషన్ కూడా ఎక్కువ. కానీ.. అందులో కూడా మార్క్ సెట్ చేసింది మెగాస్టార్. ఒక్కసారి వెనక్కి వెళ్లి.. కోటి రూపాయిల కు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి యాక్టర్ ఎవరని కొట్టి చూడండి.. మెగాస్టార్ చిరంజీవి అని వస్తుంది. బిగ్గర్ దాన్ బచ్చన్ అనే మ్యాగ్ జైన్ ఉంటుంది. వెళ్లి చదువుకోండి. మొదటి రూ.10కోట్ల కలెక్షన్ సాధించిన మొదటి చిత్రం ఘరానా మెగుడని వస్తుంది. ఇక్కడున్న చాలామందికి ఊహ తెలియక ముందే.. ఊహించని రికార్డ్స్ ను క్రియేట్ చేసిన స్టార్ మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ ను ఆయన ఎదగక ముందు అవమానాలు జరిగాయి. ఆయన ఎదిగిన తర్వాత అవమానాలు జరిగాయి. ఎదగకముందు ఎదురుతిరిగి మాట్లాడాలంటే పరిస్థితులు అడ్డు వచ్చాయి. ఎదిగిన తర్వాత అలాంటి వారికి ఎదురుతిరిగి మాట్లాడాలంటే సంస్కారం అడ్డొచ్చింది. అందుకే, ఎప్పుడూ ఎవరిని ఏమనలేదు" అని వ్యాఖ్యానించారు.
'ఠాగూర్ సినిమా లో ఆయనకు నచ్చని ఒక్క పదం క్షమించటం. నిజజీవితంలో ఆయనకు బాగా నచ్చిన పదం క్షమించటం. చాలామందిని చాలా విధాలుగా క్షమించేశారు. ఆయన రాజకీయం చేస్తున్నప్పుడు వాడెవడో ఒకడు కోడిగుడ్డు విసిరాడు చిరంజీవి మీద. ఒక్కసారి ఆయన కనుసైగ చేసి ఉంటే.. గుడ్డు వేసినోడికి అక్కడే గుండు కొట్టించేవారంతా. క్షమించాడు. మినిస్టర్ హోదాలో ఉండి.. ఓటుహక్కు వినియోగించుకోవటానికి వెళితే.. అక్కడ తనకు ఓటు ఉందా? లేదా? అని తెలుసుకోవటానికి లైన్ క్రాస్ చేస్తే.. ఒక ఎన్ఆర్ఐ.. ఈ లైన్ క్రాస్ చేసిన దానిని లిమిట్స్ దాటేసి మాట్లాడాడు అతను. చూసిన మనందరికి కోపం వచ్చింది. కానీ.. మెగాస్టార్ కు మాత్రం కోపం రాలేదు. చాలా కూల్ గా మాట్లాడారు. లైన్ క్రాస్ చేసిన విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడాడు. చొక్కా చిరిగితే చిరంజీవి సినిమా టికెట్ దొరికినట్లు.. చిరగకపోతే సినిమా టికెట్ దొరకనట్లు. అది మెగాస్టార్ రేంజ్. అలాంటి వ్యక్తుల్ని క్షమించారు' అంటూ మెగాస్టార్ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు.
కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి.. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని ప్రదర్శించే చిరంజీవి మీద అసహనాన్ని ప్ద్రదర్శించారంటూ.. "ఏ కారణం లేకుండా. ఎదురుగా ఉన్నవారికి ఎలా ఉండాలో నేర్పించే ఆయన అసహనాన్ని ప్రదర్శిస్తే.. ఆయన సహనం కోల్పోయారు కానీ ఆ రోజు మెగాస్టార్ మాత్రం సహనం కోల్పోలేదు. వెళ్లి ఆయన పక్కన కూర్చున్నారు. ఆ సభ సజావుగా జరిగేలా చేశాడు. అదీ.. మెగాస్టార్. కొన్నియూట్యూబ్ చానల్స్ ఉంటాయి. ఉదయ్ కిరణ్ గురించి.. హీరో సుమన్ గురించి.. వారికి సంబంధించి.. కొన్ని సున్నిత అంశాల మీద రాసే వారిని కూడా క్షమించాడు. అలా రాసే వారికి చెబుతున్నాను. కష్టపడి సంపాదించుకోండి. కష్టపడినోళ్ల మీద పడి సంపాదించుకోకండి" అంటూ కొందరు యూట్యూబ్ లో వీడియోలు చేసే వారికి చెబుతున్నట్లు పేర్కొన్నారు.