Begin typing your search above and press return to search.

వివాదాస్పద సిరీస్ టెర్ర‌రిస్ట్ పేర్లు ఇవేనా?

బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సిరీస్ `ఐసీ 814: ది కాంధార్ హైజ‌క్` పై వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Sep 2024 11:30 AM GMT
వివాదాస్పద సిరీస్ టెర్ర‌రిస్ట్ పేర్లు ఇవేనా?
X

బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సిరీస్ `ఐసీ 814: ది కాంధార్ హైజ‌క్` పై వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. హైజాక‌ర్ల పేర్ల విష‌యంలో నెట్టింట‌ తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిని సీరియ‌స్ గా తీసుకున్న కేంద్ర స‌మాచార‌శాఖ‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఇప్ప‌టికే నెట్ ప్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ కి స‌మ‌న్లు కూడా జారీ చేసింది. వివాదానికి దారి తీసిన అంశాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఈ షో ప్రసారమైన తర్వాత, బర్గర్, డాక్టర్, చీఫ్, భోలా, శంకర్ అనే మారుపేరు (అలియాస్)తో ఐదుగురు ముస్లిం హైజాకర్ల గుర్తింపును దాచడంపై ఇంటర్నెట్లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్ర నిర్మాత అనుభవ్ సిన్హా ఉగ్రవాదుల అసలు పేర్లను మార్చి, వారి నేరపూరిత ఉద్దేశాన్ని చట్టబద్ధం చేశారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్ట్ చేశారు.

`దశాబ్దాల తరువాత, హిందువులు ఐసీ -814 ను హైజాక్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఇది దీర్ఘకాలంలో భారతదేశ భద్రతా యంత్రాంగాన్ని బలహీనపరచడమే కాకుండా, అన్ని రక్తపాతానికి కారణమైన మత సమూహం నుంచి నిందను దూరం చేస్తుంది` అని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

చాలా మంది ఇతర ఎక్స్ వినియోగదారులు ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. భోలా, శంకర్ పేర్లు ఎందుకు పెట్టారని? అసలు పేర్లను ఎందుకు దాచారని మండిపడుతున్నారు. ఐసీ 814: కాందహార్ హైజాక్ సిరీస్లో ఐదుగురు హైజాకర్ల అసలు వివరాలు బహిర్గతం కానప్పటికీ, వారి కోడ్ నేమ్స్తో షోని నడిపించారు. వాస్తవానికి ఈ కోడ్ నేమ్స్ని కూడా 1999లో నాటి హోంశాఖ ధ్రువీకరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ లో కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి.

సంబంధిత డాక్యుమెంట్స్ ప్రకారం- ఉగ్రవాదుల అసలు పేర్లు ఇలా ఉన్నాయి. ఇబ్రహీం అథర్, బహవల్పూర్, షాహిద్ అక్తర్ సయ్యద్, గుల్షన్ ఇక్బాల్( కరాచీ), సన్నీ అహ్మద్ ఖాజీ, డిఫెన్స్ ఏరియా( కరాచీ), మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, అక్తర్ కాలనీ (కరాచీ) ,షకీర్ (సుక్కుర్ నగరం). కానీ హైజాక్ సమయంలో ఉగ్రవాదులు తమ సొంత పేర్లను వాడుకోలేదు. బదులుగా కోడ్ నేమ్స్ (1) చీఫ్, (2) డాక్టర్, (3) బర్గర్, (4) భోలా (5) శంకర్ అని పిలుచుకున్నారు. దీనినే నెట్ఫ్లిక్స్ సిరీస్లో చూపించారు.