ఇంటిమేట్ సీన్స్‌లో ఇబ్బంది పడతాను: అంజలి
అనువాద చిత్రాలు షాపింగ్ మాల్, జర్నీ వంటి హిట్ చిత్రాలతో ఈ భామ మంచి పేరు తెచ్చుకుంది.
By: Tupaki Desk | 17 Jan 2024 1:30 AM GMTఅందాల నటి, తెలుగింటి సీతమ్మ అంజలికి సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అంజలి 2006లో తెలుగు-భాషా రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఫోటోతో నటనా రంగంలోకి ప్రవేశించింది. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ , ముక్త కూడా కీలక పాత్రల్లో నటించారు. అనువాద చిత్రాలు షాపింగ్ మాల్, జర్నీ వంటి హిట్ చిత్రాలతో ఈ భామ మంచి పేరు తెచ్చుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో వేగం పుంజుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగులో వరుస అవకాశాలు అందుకున్న అంజలి గీతాంజలి లాంటి నాయికా ప్రధాన చిత్రంతోను ఆకట్టుకుంది. మాచర్ల నియోజకవర్గం, వకీల్ సాబ్, బైరాగీ, పావ కథైగల్ వంటి చిత్రాలతో భారీగా అభిమానులను సంపాదించుకుంది. అటుపై మలయాళం, కన్నడ చిత్రాలలో తనదైన ప్రతిభతో దూసుకుపోయిన అంజలి కెరీర్ జర్నీ ఇటీవల కొంత నెమ్మదించిందనే చెప్పాలి. ప్రస్తుతం తన తదుపరి తమిళ చిత్రం `యెజు కాదల్ యెజు మలై` నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. అంజలి ఇటీవల మీడియాతో సంభాషించింది. తాను ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేప్పుడు చాలా అసౌకర్యానికి గురవుతానని తెలిపింది.
ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్‌లో సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించడం వెనుక ఉన్న సవాళ్ల గురించి అంజలి ఓపెన్ గా మాట్లాడింది. అంజలి రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఇబ్బందికి గురయ్యానని కూడా వెల్లడించింది. అలాంటి సన్నివేశాలు అవసరం కాబట్టి అందులో నటించడానికి నిరాకరించలేమని చెప్పింది. ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు తన సహనటుడు తన గురించి ఏమనుకుంటాడోనని ఎప్పుడూ ఆందోళన చెందుతుంటానని చెప్పింది. అంజలి మాట్లాడుతూ, ``ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణలో నేను ఎప్పుడూ సిగ్గుపడతాను.. తరచుగా సిగ్గును దాచుకుంటాను. ఇద్దరు ప్రేమికుల మధ్య కెమిస్ట్రీకి.. నటుల మధ్య కెమిస్ట్రీకి పూర్తి భిన్నంగా ఉంటుందని నాకు తెలుసు. ఇది నా సహనటులను ముద్దుపెట్టుకోవడం.. వారితో సన్నిహిత సన్నివేశాలు చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.. అని తనలోని మదనాన్ని ఓపెనైంది.
అంజలి ఇటీవల తన పెళ్లి పుకార్ల గురించి ఓపెనైంది. నాకు సినీ పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. కాబట్టి నా గురించి ఎవరితో లింకప్ చేసి రాయాలో మీడియా వారే నిర్ణయిస్తారు. గతంలో నేను తమిళ నటుడు జైతో డేటింగ్ చేస్తున్నానని గాసిప్ స్ప్రెడ్ చేశారు. అప్పుడు నేను ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నాను.. అమెరికాలో స్థిరపడ్డాను అని వారు చెప్పారు. ఈ వార్తలు చూస్తుంటే ఎప్పుడూ నవ్వుతూ నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నానేమో అనిపిస్తుంది! అని అంది.
అంజలి చివరిగా మలయాళం-భాష క్రైమ్ థ్రిల్లర్-డ్రామా 'ఇరట్ట'లో నటించింది. దీనికి రోహిత్ MG కృష్ణన్ దర్శకత్వం వహించారు. అతడే రచయిత. ఈ చిత్రంలో జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేయగా, అంజలి, ఆర్య సలీం, శ్రీకాంత్ మురళి కీలక పాత్రలు పోషించారు.