ఇళయరాజాకు భారతరత్న అవార్డు?
లెజెండరీ స్వరకర్త, మ్యాస్ట్రో ఇళయరాజా సుస్వరాల పూదోటలో మరపురాని స్వరాల్ని అందించిన సృజనశీలి.
By: Tupaki Desk | 21 March 2025 7:04 PMలెజెండరీ స్వరకర్త, మ్యాస్ట్రో ఇళయరాజా సుస్వరాల పూదోటలో మరపురాని స్వరాల్ని అందించిన సృజనశీలి. అద్భుతమైన పాటల్ని మాత్రమే కాదు.. మహదాద్భుతం అనిపించే నేపథ్య సంగీతాన్ని అందించారు. చాలామంది ఈ రంగంలోకి వచ్చి వెళ్లారు కానీ రాజా భారతీయ సినిమాపై ఒక ముద్ర వేస్తూ దశాబ్ధాల పాటు ఏలారు. భావి తరాలు సైతం మరువని సుస్వరాల్ని అందించిన మేటి ప్రతిభావంతుడిగా ఇళయరాజా గుర్తింపు తెచ్చుకున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు తమిళం, తెలుగు, హిందీ సహా పలు భాషల్లో వందల చిత్రాలకు సంగీతం అందించారు. తాజా సమాచారం మేరకు.. ఇళయరాజాకు భారతరత్న అవార్డును ప్రదానం చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2010, 2018లో వరుసగా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను ఆయనకు ప్రదానం చేసింది. 2022లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయినా కానీ, స్వరమాంత్రికుడు వయసుతో సంబంధం లేకుండా సినిమాలకు పని చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
భారతీయ సినిమాకు ఆయన అవిశ్రాంత కృషిని, భారతీయ సంగీతానికి ఆయన అందించిన అంతులేని సృజనా జ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన సాధించిన ఘనతను పరిశీలిస్తే, ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించాలనే ఆలోచన సముచితమైనది. లివింగ్ లెజెండ్ ఇళయరాజా ఎల్లప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉన్నందున, ఎవరూ ఈ పురస్కారం విషయంలో అభ్యంతరం చెప్పరని తమిళ మీడియాలో కథనాలొస్తున్నాయి.
కళలు, మానవీయ శాస్త్రాలలో మేటి ప్రతిభను భారతప్రభుత్వం గుర్తిస్తుందనడంలో సందేహం లేతు. ఎం. జి. రామచంద్రన్, సత్యజిత్ రే, ఎం. ఎస్. సుబ్బులక్ష్మి, రవిశంకర్, లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్, భీమ్‌సేన్ జోషి గతంలో భారతరత్నను అందుకున్నారు. ఇళయరాజా తర్వాత భారతరత్న అవార్డును అందుకుంటారని ఊహాగానాలు సాగుతున్నాయి.. భారత ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటిస్తుందని ఆశిస్తున్నారు. రాజాకు అవార్డు వస్తే భారతీయ సినిమాకి అరుదైన గౌరవం దక్కినట్టే.