భవతారిణి చివరి కోరిక నెరవేరుస్తా: ఇళయరాజా
ఆయన కూతురు భవతారిణి కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సింగర్ గా పలు పాటలు పాడింది.
By: Tupaki Desk | 13 Feb 2025 5:30 PM GMTమ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయారాజా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అలనాటి కాలం నుంచి ఈ జెనరేషన్ వరకు ప్రతీ ఒక్కరూ ఆయన సంగీతానికి అభిమానులే. ఆయన సంగీతమంటే చెవులు కోసుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. పలు భాషల్లో 1500కి పైగా సినిమాలు చేసిన ఆయన సుమారు 7వేలకు పైగా పాటలు రాసి రికార్డు అందుకున్నారు.
ఆయన కూతురు భవతారిణి కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సింగర్ గా పలు పాటలు పాడింది. అయితే భవతారిణి గతేడాది క్యాన్సర్ తో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12న ఆమె జయంతి సందర్భంగా ఇళయరాజా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తన కుమార్తె చివరి కోరికను నెరవేర్చడానికి బాలికలతో ఓ పెద్ద ఆర్కెస్ట్రాను ప్రారంభించబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
కేవలం బాలికలే ఉండేలా ఓ ఆర్కెస్ట్రాను స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు భవతారిణి తనకు చెప్పిందని, అదే ఆమె చివరి కోరిక అని, రెండ్రోజుల కిందట మలేషియాలో తన ముందు యువతులతో కూడిన ఆర్కెస్ట్రా ఓ షో చేయడం వల్ల భవతారిణి కోరిక గుర్తొచ్చిందని, ఈ నేపథ్యంలోనే తాను ఓ ఆర్కెస్ట్రాను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు.
15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లే ఇందులో భాగమవుతారని, ఈ టీమ్ ప్రపంచ వ్యాప్తంగా పెర్ఫార్మ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని, దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు టైమ్ వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తామని, ఆసక్తి కలిగిన వాళ్లు నమోదు చేసుకుని ఇందులో భాగమవడానికి ఆడిషన్స్ లో పాల్గొనమని ఆయన వెల్లడించారు.
ఈ ఆర్కెస్ట్రా ద్వారా భవతారిణి వారసత్వాన్ని నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా మరింత ఉత్సాహాన్ని వ్యాపింపచేయాలని కోరుకుంటున్నట్టు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఎమోషనల్ అయ్యారు. భవతారిణి జయంతి రోజును స్మరించుకోవడానికి ప్రతీ ఏటా ఫిబ్రవరి 12న ఓ స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహిస్తానని ఇళయరాజా ఈ సందర్భంగా తెలిపారు.