ఆలయంలో మ్యాస్ట్రో ఇళయరాజాకు అవమానమా?
దీనిపై స్పందించిన ఇళయరాజా ఈ వార్తలన్నీ అవాస్తవమని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులను, ప్రజలను కోరారు.
By: Tupaki Desk | 16 Dec 2024 3:09 PM GMTప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన ఇళయరాజా తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అగౌరవానికి గురయ్యారనే ప్రచారం జరిగింది. దేవతను దర్శనం చేసుకునేందుకు గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించలేదని, బయటి నుండి దేవతను వీక్షించమని పూజారులు బలవంతం చేశారని వార్తా కథనాలొచ్చాయి. ఈ పుకార్లు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
దీనిపై స్పందించిన ఇళయరాజా ఈ వార్తలన్నీ అవాస్తవమని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులను, ప్రజలను కోరారు. తన ఆత్మగౌరవం విషయంలో తానెప్పుడూ రాజీపడబోనని, ప్రచారంలో ఉన్న సంఘటన ఎప్పుడూ జరగలేదని ఆయన ఉద్ఘాటించారు.
మతపరమైన ప్రదేశాల్లో కుల వివక్ష ప్రదర్శించారని, శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీ ఆండాళ్ ఆలయంలోని గర్భగుడిలోకి ఇళయరాజాను రానీయకుండా అడ్డుకున్నారని కొన్ని కథనాలు మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాజా అభిమానులు ఆలయ పరిపాలకులను దూషించారు. భవిష్యత్తులో అలాంటి ఆలయాలను సందర్శించవద్దని కోరారు.
1000 పైగా చిత్రాలకు స్వరాలు అందించిన దిగ్గజ సంగీతకారుడు రాజా తన `దివ్య పాసురం` సంగీతాన్ని అందించడానికి ఆలయానికి వచ్చారు. 12 మంది వైష్ణవ సాధువులైన ఆళ్వార్ల ఎంపిక చేసిన పాటల ఆల్బమ్‌ను ఈ ఏడాది జూన్‌లో విడుదల చేశారు. ఆ తర్వాత నాట్యాంజలి అనే నృత్య ప్రదర్శన కూడా జరిగింది. కార్యక్రమం తర్వాత మాస్ట్రో వైష్ణవ మఠం అధిపతి అయిన జీయర్‌తో గర్భగుడిలోకి వెళ్లడానికి అనుసరించారు. కానీ అర్థ మండపం ప్రవేశద్వారం వద్ద రాజాను ఆపివేసారని కథనాలొచ్చాయి. అర్థ మండపంలోకి ప్రవేశించవద్దని జీయర్ కోరడంతో, ఇళయరాజా ప్రవేశద్వారం నుండే శ్రీ ఆండాళ్, రెంగమన్నార్ స్వామికి పూజలు చేశారని కూడా కథనాలు వైరల్ అయ్యాయి.
ఇదిలావుండగా తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్ అండ్ సిఇ) శాఖ పరిధిలోకి వచ్చే శ్రీ ఆండాళ్ ఆలయంలో లెజెండ్ ఇళయరాజాపై ఎలాంటి వివక్ష లేదని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు.