ఫిలింక్రిటిక్ మరణిస్తే తక్షణ ఆర్థిక సాయం
24 శాఖలు కలిస్తేనే టాలీవుడ్. కానీ ఏ శాఖలోను లేనిది సినిమా జర్నలిజం.
By: Tupaki Desk | 17 Sep 2023 5:58 PM GMT24 శాఖలు కలిస్తేనే టాలీవుడ్. కానీ ఏ శాఖలోను లేనిది సినిమా జర్నలిజం. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు సినీజర్నలిస్టులను పరిశ్రమ 25వ శాఖ సభ్యులుగా చూడాలని కోరేవారు. సినిమా వార్తలను నిరంతరం కవర్ చేస్తూ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పని చేసే శ్రమజీవులు అయిన జర్నలిస్టులకు కష్టనష్టాల్లో ఆదుకునేందుకు ఎప్పుడూ పరిశ్రమ ముందుండాలని ఆకాంక్షించేవారు. దివంగత దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవి, దిల్ రాజు సహా పలువురు ఇప్పటికే జర్నలిస్టులకు రకరకాల మార్గాల్లో సాయం అందించారు. ఇక ఐదు దశాబ్ధాలు పైగా మనుగడ సాగించిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల్లో ఎవరు మరణించినా ఆ కుటుంబానికి ఆర్థికంగా తక్షణ సహకారం అందుతోంది. మరణించిన క్రిటిక్ కుటుంబానికి 25వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.
ఈనాడు, సితార సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కుమారస్వామి ఇటీవల మృతి చెందడంతో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం, సభ్యులు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారస్వామితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భార్య విజయలక్ష్మి, కుమార్తె అర్చన, కుమారులు అర్పణ్ కుమార్, అరుణ్ కుమార్ లను ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించారు.
ఫిలిం క్రిటిక్స్ సభ్యులు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అసోసియేషన్ అందజేస్తుంది. అందులో భాగంగానే రూ. 25 వేల చెక్కును కుమారస్వామి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే సీనియర్ జర్నలిస్టులతో పాటు కుమారస్వామి ఇంటికి వెళ్లిన నటుడు ఉత్తేజ్ కూడా తనవంతు సాయాన్ని అందజేశారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మీనారాయణ, కోశాధికారి పి. హేమసుందర్, ఉపాధ్యక్షుడు సురేష్ కవిర్యాని, సినీయర్ జర్నలిస్టులు వినాయకరావు, ప్రభు, ఫొటో జర్నలిస్టు జయకృష్ణ, నటుడు ఉత్తేజ్ తదితరులు కుమారస్వామి ఇంటికి వెళ్లిన వారిలో ఉన్నారు. సినీ రంగంలో ఫొటో జర్నలిస్టుగా ఎన్నో ఏళ్లుగా కుమార్ స్వామి పనిచేశారు. ఆయన తీసిన ఫొటోలు సితార కవర్ పేజీలుగా వచ్చేవి. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఇటీవలే మరణించారు. వారి కుటుంబానికి క్రిటిక్స్ సంతాపం తెలియజేసి ఆర్థిక సహకారం అందించారు.