అభిమానుల ఆశలపై నీళ్లు జల్లేసిన డైరెక్టర్!
షాహిద్ కపూర్ -కరీనా కపూర్ జంటగా ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన `జబ్ వి మెట్` చిత్రం అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 14 March 2025 12:50 PM ISTషాహిద్ కపూర్ -కరీనా కపూర్ జంటగా ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన `జబ్ వి మెట్` చిత్రం అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అప్పట్లో మంచి వసూళ్లను సాధించింది. 15 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన చిత్రం 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. షాహిద్ కపూర్-కరీనా కపూర్ కెరీర్ లో మరో గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని అభిమానులు చాలా కాలంగా అడుగుతున్నారు.
అదే కాంబినేషన్ లో ఇంతియాజ్ అలీనే ఆ బాధ్యతలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. దీంతో సీక్వెల్ రావడం ఖాయమని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేసి ఒరిజినల్ వెర్షన్ చెడగొట్టడం ఇష్టం లేదంటూ ఇంతియాజ్ అలీ షాక్ ఇచ్చాడు. `అప్పట్లో ఈ జంటతో పనిచేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.
కానీ ప్రస్తుతానికి వీరితో మరో ప్రాజెక్ట్ చేయాలనుకోవడం లేదు. `జబ్ వి మెట్` రిలీజ్ అయి చాలా కాల మైంది. ఏళ్లు గడిచినా ప్రేక్షకుల హృదయాల్లో గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు సీక్వెల్ చేసినా అది అంత గొప్ప గా ఉండదు. చేస్తే ఒరిజినల్ వెర్షన్ కూడా చేడిపోయినట్లు అవుతుంది. అందుకే సీక్వెల్ ఆలోచన ఎప్పుడూ నా మైండ్ లోకి రానివ్వలేదు. కొన్ని కథల్ని టచ్ చేయకపోవడమే మంచిదన్నది నా అభిప్రాయం.
కొత్త కథలతో సినిమాలు తీస్తే బాగుంటుందనుకుంటున్నాను` అని అన్నారు. గత ఏడాది ఇంతియాజ్ అలీ రెండు చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. `అమర్ సింగ్ చంకీలాలా`, మై మెల్ బోర్న్ చిత్రాలు రిలీజ్ అయ్యయి. అమర్ సింగ్ సినిమా యావరేజ్ గా ఆడింది. మై మెల్ బోర్న్ మాత్రం అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ పై పని చేస్తున్నారు.