ఆగస్టులో ఇండియన్ సినిమాని షేక్ చేసిన మూవీస్ ఇవే
ఈ నెలలో విడుదలైన సినిమాల్లో తలైవా రజనీకాంత్ నటించిన 'జైలర్' వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది
By: Tupaki Desk | 31 Aug 2023 4:38 AM GMTప్రతి నెలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలు, చిన్న చిత్రాలు సందడి చేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు నెలలో విడుదలైన సినిమాలు మాత్రం ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డుని సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్ల సునామీని సృష్టించాయి. రికార్డు స్థాయిలో కలెక్షన్‌లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేశాయి. అయితే ఇందులో కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు లేకపోవడం గమనార్హం.
ఈ నెలలో విడుదలైన సినిమాల్లో తలైవా రజనీకాంత్ నటించిన 'జైలర్' వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్'సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ సినిమాల నిర్మాత కళానిధి మారన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఆగస్టు 10న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
తొలి రోజు నుంచే రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ని రాబట్టిన 'జైలర్' రజనీ మేనియాతో ఇప్పటి వరకు రూ.550 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుల్ని తిరగరాసింది. దక్షిణాది రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టిన తొలి ఇండియన్ సినిమాగా 'జైలర్' రికార్డుని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా పలు తమిళ సినిమాల రికార్డుల్ని తిరగరాస్తూ రికార్డు సరికొత్త ఫీట్ కు చేరుకుంటోంది. ఇక ఈ సినిమా విడుదలైన రోజు హిందీ సినిమా 'గదర్ 2' థియేటర్లలోకి వచ్చింది. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు.
కొన్నేళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన 'గదర్'కు సీక్వెల్ కావడంతో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు మించి సినిమా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.460 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వయసులో సన్నీ డియోల్, అమీషా జోడీ ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు రూ.700 కోట్ల మేర గ్రాస్‌ని రాబట్టాయి.
అయితే ఈ రేస్‌లో తెలుగు సినిమాలు వెనకబడిపోవడం గమనార్హం. ఆగస్టు నెలలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు జైలర్, భోళా శంకర్, ఉస్తాద్, ఓఎంజీ2, గదర్ 2, బెదురు లంక, డ్రీమ్ గర్ల్ 2, కింగ్ ఆఫ్ కోథ ఇలా పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ సినిమాల్లో జైలర్, గదర్ 2, ఓంఎంజీ 2 మాత్రమే మంచి టాక్‌ని సొంత చేసుకుని బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించాయి. ఇలా హిట్ అనిపించుకున్న ఈ సినిమాలన్నీ కలిపి ఒకే నెలలో రూ.1000 కోట్ల మేర ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబట్టడం రికార్డుగా నిలిచింది. ఇండియన్‌సినీ హిస్టరీలోనే ఇదొక అరుదైన రికార్డుగా మారింది. సెప్టెంబర్‌లో భారీ సినిమాల జాతర మొదలు కాబోతోంది. 'సలార్' రాబోతోంది. మరి ఈ నెలలో కూడా ఇదే ఫీట్ రిపీట్ అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.