2028 నాటికి గ్లోబల్ సినిమా మీడియా రంగం దూకుడు!
ఇస్పోర్ట్స్ , ఆన్‌లైన్ గేమింగ్ 2028 నాటికి రూ. 39,583 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది 19.2 శాతం కాంపౌండ్ వార్షిక రేటు వద్ద పెరుగుతోంది.
By: Tupaki Desk | 11 Dec 2024 5:18 AM GMTభారతీయ వినోద రంగం, మీడియా పరిశ్రమ ఆదాయం 2028 నాటికి రూ. 3.65 లక్షల కోట్లకు చేరుకుంటుందని పాపులర్ సర్వే వెల్లడించినట్టు బిజినెస్ టుడే తన కథనంలో పేర్కొంది. పిడబ్ల్యూసి నివేదిక ప్రకారం.. భారతీయ వినోదం, మీడియా పరిశ్రమ ఆదాయం 8.3 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) వద్ద రూ. 3,65,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత E&M ఇండస్ట్రీ వృద్ధి గ్లోబల్ రేటు 4.6 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని సర్వే పేర్కొంది. గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ & మీడియా ఔట్‌లుక్ 2024 -28: ఇండియా పెర్స్‌పెక్టివ్ నివేదిక ప్రకారం.. ప్రకటనల ఆదాయం 9.4 శాతం వృద్ధి చెంది రూ. 1.58 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 6.7 శాతం కంటే కూడా ఎక్కువ. అడ్వర్టైజింగ్ 15.6 శాతం వృద్ధి చెంది రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసారు. ఇది టాప్ 15 దేశాలలో అత్యధిక వృద్ధి రేటు. ప్రపంచ సగటు కంటే 1.6 రెట్లు ఎక్కువ.
ఇస్పోర్ట్స్ , ఆన్‌లైన్ గేమింగ్ 2028 నాటికి రూ. 39,583 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది 19.2 శాతం కాంపౌండ్ వార్షిక రేటు వద్ద పెరుగుతోంది. OTT వేదికల విషయానికి వస్తే, ఈ విభాగం 2028 నాటికి 14.9 శాతం CAGR వద్ద రూ. 35,061 కోట్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది టాప్ 15 దేశాలలో అత్యధికం.
భారతదేశం ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో ఉంది. అమెరికా ప్రపంచంలోనే వినోదం, మీడియా మార్కెట్ ఆదాయంలో అగ్రగామిగా ఉండగా.. చైనా ఆ తరువాతి స్థానంలో ఉంది. గ్లోబల్ E&M రాబడులు సంవత్సరానికి 5.5 శాతం పెరిగాయి. 2022లో రూ. 13,891,000 కోట్ల నుండి 2023లో రూ. 17,359,000 కోట్లకు ఈ రాబడి పెరిగింది.
డిజిటల్ అడ్వర్టైజింగ్, OTTలు, ఆన్‌లైన్ గేమింగ్, జెనరేటివ్ AI వంటివి కీలక వృద్ధి పథంలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
భారతదేశానికి ఉన్న మెరుగైన కనెక్టివిటీ, పెరుగుతున్న ప్రకటనల ఆదాయాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) వెల్లువకు అనుకూల ప్రభుత్వ విధానాలు భారతదేశ వృద్ధి గణాంకాలను ముందుకు తీసుకువెళతాయని బిజినెస్ టుడే కథనం పేర్కొంది. భారతదేశంలో యువతరం అధికంగా ఉన్నారు. జెన్ జెడ్ తో పాటు, 91 కోట్లకు పైగా ఉన్న మిలీనియల్ జనాభా బేస్ భారతదేశ చౌకైన డేటా ఖర్చులకు అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా భారతదేశంలో 80 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్‌లు, 55 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు, 78 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. భారతీయులు తమ సమయాన్ని 78 శాతం మొబైల్ ఫోన్ యాప్‌లపై, మీడియా- వినోదం కోసం వెచ్చిస్తున్నారని కూడా ఈ కథనం పేర్కొంది. 2023 నుండి 2028 వరకు సాంప్రదాయ టీవీ ప్రకటనలు 4.2 శాతం CAGR వద్ద పెరుగుతాయని, ప్రపంచ ఆదాయాలు 1.6 శాతం తగ్గుతాయని పిడబ్ల్యూసి నివేదిక పేర్కొంది.
ప్రింట్ ప్రకటనల విషయానికి వస్తే.. భారతదేశం ప్రింట్ అడ్వర్టైజింగ్ మార్కెట్ 3 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా. ఈ వృద్ధి పథం భారతదేశాన్ని 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ముద్రణ మార్కెట్‌గా నిలుపుతోంది. భారతీయ సినిమా మార్కెట్ కూడా 14.1 శాతం CAGR వద్ద విస్తరిస్తూ ఉన్నత పథంలో ఉంది. ఇది దేశవ్యాప్తంగా సినీరంగంపై పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తుంది.
భారతదేశంలో మ్యూజిక్ ఆదాయం రకరకాల మార్గాల్లో ఉంది. ఇది అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. 2019లో రూ. 2,416 కోట్ల నుంచి, 2023లో రూ. 6,686 కోట్లకు చేరుకుంది. 2028 నాటికి రూ. 10,899 కోట్లను అధిగమిస్తుందని అంచనా. 10.3 శాతం CAGR వద్ద వృద్ధి చెందుతుంది.