'జైలర్'ను చూసి నిర్ణయం తీసుకోవాల్సింది
మరి అన్నీ తెలిసిన ఆయనే రేట్ల పెంపుకు అనుమతులు తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
By: Tupaki Desk | 11 July 2024 4:30 PM GMTఈ శుక్రవారం రిలీజవుతున్న ‘ఇండియన్-2’ సినిమాకు ముందు నుంచి బజ్ తక్కువే ఉంది. మామూలుగా అయితే ‘ఇండియన్’ లాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్.. పైగా శంకర్-కమల్ హాసన్ కలయికలోనే సినిమా తెరకెక్కుతోందంటే హైప్ ఒక రేంజిలో ఉండాలి. కానీ ఈ సినిమా మేకింగ్ బాగా ఆలస్యం కావడం.. మధ్యలో ఆగిన ఈ చిత్రం రెండేళ్ల పాటు అతీగతీ లేకుండా పోవడం.. రిలీజ్ ముంగిట వదిలిన ప్రోమోలు ఎగ్జైటింగ్‌గా లేకపోవడం.. పాటలు కూడా అంతంతమాత్రంగా అనిపించడం.. ఇలా ఆశించిన బజ్ రాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇలా హైప్ తక్కువ ఉన్నపుడు సినిమాను నార్మల్ టికెట్ల ధరలతోనే రిలీజ్ చేయాల్సింది. కానీ అవకాశం ఉంది కదా అని తెలంగాణ ప్రభుత్వానికి అప్లై చేసుకుని రేట్లు పెంచుకున్నారు. టికెట్ల రేట్ల పెంపు వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్న విషయం గురించి గతంలో మాట్లాడిన సురేష్ బాబు ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తుండడం గమనార్హం. మరి అన్నీ తెలిసిన ఆయనే రేట్ల పెంపుకు అనుమతులు తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
బజ్ లేనపుడు ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాలో చెప్పడానికి ‘జైలర్’ సినిమా సరైన ఉదాహరణ. ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలకు తెలుగులో బంపర్ క్రేజ్ ఉండేది. కానీ గత పదేళ్లలో సరైన సినిమాలు చేయక ఆయన క్రేజ్, మార్కెట్ దెబ్బ తిన్నాయి. కొన్ని సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ లేకపోయాయి. ఇలాంటి టైంలో గత ఏడాది ‘జైలర్’ రిలీజవగా.. రేట్ల పెంపుకోసం ప్రయత్నించలేదు. నార్మల్ రేట్లతో సినిమాను రిలీజ్ చేశారు. తొలి రోజు ఆక్యుపెన్సీలో ఒక మోస్తరుగా కనిపించాయి. కానీ సినిమా పర్లేదని, రజినీ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అనే టాక్ రావడంతో తర్వాత జనం థియేటర్లకు పోటెత్తారు. సిినమా తిరుగులేని విజయం సాధించింది. సినిమాలో ఉన్న కంటెంట్‌ను మించి సినిమా సక్సెస్ అయింది. ‘ఇండియన్-2’కు బజ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో నార్మల్ రేట్లతోనే రిలీజ్ చేయాల్సింది. టాక్ బాగుంటే.. జనం ఆటోమేటిగ్గా థియేటర్లకు వచ్చేవాళ్లు. ‘కల్కి’ సినిమాకు రేట్లు తగ్గాక రెండో వారంలో జనం బాగా థియేటర్లకు రావడం కూడా ఇక్కడ గమనార్హం. కానీ ఆక్యుపెన్సీలు పెంచుకుని సినిమాకు లాంగ్ రన్ ఉండేలా చూసుకోవడం కంటే.. తొలి వీకెండ్లో వీలైనంత లాగేయాలన్న తాపత్రయం వల్ల అసలుకే మోసం వస్తోందని నిర్మాతలు, బయ్యర్లు గ్రహిచకపోవడమే విచారకరం.