ఇండియన్ 2 మూవీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం
ఈ మధ్యకాలంలో దర్శక నిర్మాతలు మూవీ సిరీస్ లపైనా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
By: Tupaki Desk | 15 July 2024 4:18 AM GMTఈ మధ్యకాలంలో దర్శక నిర్మాతలు మూవీ సిరీస్ లపైనా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ లో ఒక కథని పెర్ఫెక్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేసేవారు. అయితే ఇప్పుడు ప్రతి కథకి కూడా సీక్వెల్ ఉంటే బాగుంటుందనే ఆలోచనతో స్టోరీస్ సిద్ధం చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా సీక్వెల్స్ కి మొగ్గు చూపిస్తూ ఉన్నారు. దీంతో దర్శకులు చెప్పాల్సిన కథని స్ట్రైట్ గా నేరేట్ చేయకుండా పార్ట్ 2కి సస్పెన్స్ క్యారీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దీంతో కావాలని కొన్ని ఎలిమెంట్స్ ని రివీల్ చేయకుండా వదిలేస్తున్నారు. అయితే ఈ పద్ధతి మొదటి సినిమానే ప్రేక్షకులకి దూరం చేస్తోంది.
అసందర్భ ముగింపులతో, క్లారిటీ లేని నేరేషన్ తో వచ్చిన స్కంద, పెదకాపు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ 2 మూవీ జులై 12న థియేటర్స్ లోకి వచ్చింది. ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. మూవీ బడ్జెట్ 500 కోట్ల వరకు అయిపోవడంతో రికవరీ కోసం రెండు భాగాలుగా చేశారు. ఇండియన్ 2, ఇండియన్ 3 గా శంకర్ కథని చెప్పాలని అనుకున్నారు.
మార్కెటింగ్ స్ట్రాటజీతోనే పెట్టుబడి మొత్తం రికవరీ చేయాలనే ఉద్దేశ్యంతో కరెక్ట్ గా ఒక్క సినిమాకి సరిపోయే కథని రెండుగా చేశారు. దీంతో మూవీ లెంత్ పెంచడం కోసం శంకర్ అనవసరమైన సన్నివేశాలని తీసుకొచ్చి కథలో జొప్పించారు. ఈ ప్రయోగం పూర్తిగా బెడికొట్టింది. ప్రేక్షకుల నుంచి మూవీ తిరస్కరణకి గురైంది. తెలుగు సినిమాల ప్రొడక్షన్ ఖర్చు ఎప్పుడు కూడా 200 కోట్లు దాటిన దాఖలాలు లేవు. రెమ్యునరేషన్ లతో కలుపుకొని టాలీవుడ్ సినిమాల ఖర్చు ఎక్కువ కనిపిస్తోంది.
అయితే శంకర్ సినిమాల ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. రోబో సీక్వెల్ గా వచ్చిన 2.ఓ మూవీకి 500 కోట్ల వరకు ఖర్చు చేశారు. గ్రాండ్ నెస్ కోసం భారీగా ఖర్చుచేసిన ఆడియన్స్ నుంచి ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ మూవీ సీక్వెల్స్ విషయంలో అదే పొరపాటు జరిగింది. ఖర్చు పెరిగిందని రికవరీ కోసం రెండు భాగాలు చేసేసారు. ఇలా చేయడం వలన చెప్పాల్సిన కథకి కరెక్ట్ గా ఆడియన్స్ కి నేరేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.
ఇండియన్ 2 చూడటం కంటే ఇండియా మూవీ మరోసారి వీక్షించడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ చూసి బడ్జెట్ పెరిగిందని సినిమాలని రెండు భాగాలుగా చేయాలనుకునే ప్రతి ఒక్కరు పాఠం నేర్చుకోవాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.