ISPL-T10 లో చరణ్‌తో సహయజమాని ఎవరు?
ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. తాజాగా రామ్ చరణ్ ఈ కొత్త వెంచర్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు
By: Tupaki Desk | 9 Jan 2024 1:38 PM GMTఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫ్రాంఛైజీలో భాగస్వాములుగా షారూఖ్- జూహీచావ్లా, ప్రీతిజింతా, శిల్పాశెట్టి వంటి ప్రముఖుల పేర్లు నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచాయి. ఇది పరిమిత 20ఓవర్ల క్రికెట్ ఫార్మాట్. ఇప్పుడు అందుకు భిన్నంగా 10 ఓవర్ల మ్యాచ్ లకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ISPL-T10 లీగ్ తో గల్లీ క్రికెటర్లలో ప్రతిభావంతులను ప్రోత్సహించే ప్రయత్నం ఆసక్తిని పెంచుతోంది. అలాంటి ప్రతిభను వెలికి తీయడానికి నేను సైతం అంటూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముందుకు వచ్చారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ T10 (ISPL-T10)లో హైదరాబాద్ జట్టుకు చరణ్ గర్వకారణమైన యజమాని అని ఇంతకుముందే ప్రకటించారు. T10 క్రికెట్ టోర్నమెంట్, క్రికెట్ ల్యాండ్‌స్కేప్‌కు భిన్నంగా ఉత్కంఠభరితంగా అదనపు వినోదాన్ని పంచే టోర్నీ ఇది. హైదరాబాద్ జట్టు సహ యజమానిగా రామ్ చరణ్ ప్రవేశం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. తాజాగా రామ్ చరణ్ ఈ కొత్త వెంచర్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ''బిడ్‌ను ప్రారంభించినప్పుడు 'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్'లో నా టీమ్ హైదరాబాద్ కు సహ-యజమాని చేతులు కలిపాను. ఆకాంక్షలను విజయాలుగా మార్చుకుందాం.. కలిసి విజయం సాదిద్దాం. ispl-t10.comలో సహయజమానిగా చేరేందుకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి'' అని రాసారు.
లీగ్‌లోకి చరణ్ ప్రవేశం ఉత్కంఠను పెంచింది. అతడితో సహయజమాని అయ్యేందుకు ఎవరు ఉత్సాహం చూపిస్తారో చూడాలి. చరణ్ సహా అక్షయ్, సైఫ్ ఖాన్, అమితాబ్, హృతిక్, సూర్య వంటి ప్రముఖులతోను సహయజమానిగా చేరేందుకు అవకాశం కల్పించారు. ఈ టోర్నీ అభిమానుల ఆనందాన్ని మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. T10 క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన టోర్నీగా నిలుస్తుందా? అంటూ క్రికెట్ ఔత్సాహికులు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. కియరా అద్వాణీ ఇందులో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.