ఇండియా టుడే సర్వే.. దేశానికి ఉత్తమ ప్రధానమంత్రులు వీరే!
ఈ మేరకు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే దేశంలో అన్ని లోక్ సభ స్థానాల్లో 35,801 మందిపై సర్వే నిర్వహించింది
By: Tupaki Desk | 12 Feb 2024 6:42 AM GMTప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే.. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దేశాన్ని పరిపాలించినవారిలో నరేంద్ర మోదీ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని వెల్లడైంది.
ఈ మేరకు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే దేశంలో అన్ని లోక్ సభ స్థానాల్లో 35,801 మందిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేను డిసెంబర్ 15, 2023, జనవరి 28, 2024 మధ్య నిర్వహించింది. ఈ సర్వేను ఫిబ్రవరి ఎడిషన్ లో వెల్లడించింది.
ఈ సర్వేలో 44 శాతం మంది దేశానికి ఉత్తమ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని ఎంచుకున్నారు. ఆ తర్వాత అత్యధికంగా 15 శాతం మంది అటల్ బిహారి వాజపేయిని ఉత్తమ ప్రధానిగా ఎంపిక చేశారు. మరో 14 శాతం ఇందిరాగాంధీని ఉత్తమ ప్రధానిగా తేల్చారు. మోదీ, వాజపేయి, ఇందిరాగాంధీల తర్వాత మన్మోహన్ సింగ్ నిలిచారు. మన్మోహన్ సింగ్ ను ఉత్తమ ప్రధానిగా 11 శాతం మంది ఎంపిక చేసుకున్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు వంటివాటితో ప్రధాని నరేంద్ర మోదీని అభిమానించేవారి సంఖ్య పెరిగిందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. ఏకంగా సర్వేలో 42 శాతం మంది రామమందిర నిర్మాణం ప్రధాని మోదీ విజయాల్లో ప్రధానమైందని పేర్కొన్నారు.
రాములవారి ప్రాణ్ ప్రతిష్ట వేడుకకు ప్రధాన కర్తగా ప్రధాని మోదీ కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విగ్రహాన్ని ఆవిష్కరించడం, కళ్లకు గంతలు విప్పడం, హారతి ఇవ్వడం, మొదటి దర్శనం మోదీనే చేసుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలలో ప్రధానమైన హామీ కావడం గమనార్హం.
అలాగే సర్వేలో 19 శాతం మంది ప్రధాని మోదీ ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. మరో 12 శాతం మంది జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని మోదీకి సానుకూలతగా అభివర్ణించారు. ఇంకో 9 శాతం మంది పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మోదీ విజయంగా పేర్కొన్నారు. అలాగే 6 శాతం మంది నోట్ల రద్దును, మరో 6 శాతం కోవిడ్ –19 సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నందుకు, ఇంకో 5 శాతం మంది అవినీతికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గానూ ఆయనను ఉత్తమ ప్రధానిగా ఎంపిక చేశారు.