Begin typing your search above and press return to search.

ఎమ్మీ అవార్డ్స్ 2024: అవార్డు మిస్స‌యినా శోభిత‌కు పేరొచ్చింది

52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల జాబితా విడుద‌లైంది. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఈవెంట్‌కు భారతీయ హాస్యనటుడు నటుడు వీర్ దాస్ హోస్టింగ్ చేసారు.

By:  Tupaki Desk   |   26 Nov 2024 7:48 AM GMT
ఎమ్మీ అవార్డ్స్ 2024: అవార్డు మిస్స‌యినా శోభిత‌కు పేరొచ్చింది
X

52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల జాబితా విడుద‌లైంది. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఈవెంట్‌కు భారతీయ హాస్యనటుడు నటుడు వీర్ దాస్ హోస్టింగ్ చేసారు. అత‌డు స్టాండ్-అప్ స్పెషల్ ల్యాండింగ్ కోసం 2023లో అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఈసారి ఎమ్మీ అవార్డుల్లో అక్కినేని కోడ‌లు శోభిత ధూళిపాల న‌టించిన `ది నైట్ మేనేజ‌ర్` పోటీబ‌రిలో నిల‌వ‌డంతో భార‌తీయ అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

అయితే ది నైట్ మేనేజ‌ర్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకోలేక‌పోయినా శోభిత న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ముఖ్యంగా హాలీవుడ్ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో శోభిత సినిమా మెరిసింద‌నే చెప్పాలి. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ వంటి స్టార్లు న‌టించారు. ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా విభాగంలో ఫ్రెంచ్ నాటకం లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్)కు అవార్డును కోల్పోయింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులు ఫ్రెంచ్ డ్రామా `లెస్ గౌట్టెస్ డి డైయు`ను విజేతగా ప్రకటించిన తర్వాత శోభిత స‌హా భార‌తీయ అభిమానులు కొంత నిరాశ‌కు గుర‌య్యారు.

ఈ ఉత్స‌వాల్లో ఆదిత్య రాయ్ కపూర్ తన చేతిలో భారతీయ జెండాను పట్టుకుని `ది నైట్ మేనేజర్` సృష్టికర్త సందీప్ మోడీతో కలిసి రెడ్ కార్పెట్ పై నడిచాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం ఇద్దరూ బ్లాక్ టక్సెడోస్ ధ‌రించారు.

ది నైట్ మేనేజర్ అనేది అదే పేరుతో ఉన్న బ్రిటిష్ సిరీస్‌కి భారతీయ రీమేక్‌. ఇది 2023లో రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకుల నుండి విస్తృతమైన ప్రశంసలను అందుకుంది. ది నైట్ మేనేజర్ బ్రిటిష్ వెర్షన్ 2016లో మూడు గోల్డెన్ గ్లోబ్‌లు, రెండు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను గెలుచుకుని ప్రపంచ గుర్తింపు పొందింది. న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ హిల్టన్ మిడ్‌టౌన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిట‌న్, ఇండియా, ఫ్రాన్స్‌ సహా 21 దేశాల నుండి 56 మంది నామినీలు పాల్గొన్నారు.