అర్థం కాలేదన్నారు.. అయినా మళ్లీ థియేటర్లలోకి
ఆ సినిమా తర్వాత అతడు మళ్లీ ఓ బయోపిక్ తెరకెక్కిస్తున్నారని కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 11 Jan 2025 4:28 AM GMTక్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన సినిమాటిక్ మాస్టర్ పీస్ 'ఓపెన్ హీమర్' సంచలన వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. డన్ కిర్క్, టెనెట్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత అణుబాంబ్ తయారీ నేపథ్యంలోని బయోపిక్ కథాంశంతో 'ఓపెన్ హీమర్' తెరకెక్కింది. ఇది బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. ఆ సినిమా తర్వాత అతడు మళ్లీ ఓ బయోపిక్ తెరకెక్కిస్తున్నారని కథనాలొచ్చాయి.
అయితే నోలాన్ నుంచి ఈ సినిమా వచ్చేందుకు ఇంకా సమయం ఉంది. ఇంతలోనే అతడు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'ఇంటర్ స్టెల్లార్' మళ్లీ థియేటర్లలో అలరించేందుకు వస్తోంది. ఫిబ్రవరి 7న 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. 2014లో ఇంటర్ స్టెల్లార్ విడుదలైంది. అయితే అప్పట్లో ఆడియెన్ కి ఈ సినిమా అర్థం కావడానికే సమయం పట్టింది. చాలా మంది తెలుగు సినీవిశ్లేషకులు, క్రిటిక్స్ కూడా తమకు ఈ సినిమా అర్థం కాలేదని అన్నారు. కానీ విజువల్ గా అద్భుత దృశ్యాలను వీక్షించామని ప్రశంసించారు. నోలాన్ మైండ్ గేమ్, లాజిక్కులు అర్థం కావాలంటే సినిమాని ఒకసారి చూస్తే సరిపోదు. పదే పదే చూడాలని కూడా పలువురు క్రిటిక్స్ సూచించారు.
అయితే ఇంటర్ స్టెల్లార్ రీరిలీజ్ వార్తలు ఇప్పుడు నోలాన్ అభిమానులను కుదిపేస్తున్నాయి. 'పుష్ప 2' హవా ముగిసిన క్రమంలో నోలాన్ నుంచి వచ్చిన పాత సినిమానే మళ్లీ ఆడియెన్ ని థియేటర్లకు రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమాలు తీయడంలో మాస్టర్ అయిన నోలాన్ ఇంటర్ స్టెల్లార్ కథనాన్ని వండి వార్చిన తీరుకు ప్రపంచ సినీవీక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇది సినిమాటిక్ మాస్టర్ పీస్ అన్న ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడు ఇంటర్ స్టెల్లార్ ని కాస్త ఓపిగ్గా వీక్షించేందుకు తెలుగు ఆడియెన్ కి వెసులుబాటు ఉంది. చాలా హాలీవుడ్ సినిమాలు చూసేస్తూ ఇప్పటికే అలవాటు పడిన ప్రాంతీయ ఆడియెన్ కి కూడా ఈ విజువల్ బ్యూటీ కనెక్టవుతుందేమో చూడాలి. భారతదేశంలోని ఐమ్యాక్స్ థియేటర్లలో ఇంటర్ స్టెల్లార్ ని రిలీజ్ చేయనున్నారు. అంటే సాధారణ థియేటర్లలో ఇది విడుదల కాదు. ఇంటర్ స్టెల్లార్ కథాంశం, కథనంలో డెప్త్, ఉత్కంఠభరితమైన విజువల్స్ .. మరపురాని రీరికార్డింగ్ ఇవన్నీ మరోసారి ఆడియెన్ ని థ్రిల్ కి గురి చేస్తాయని విశ్లేషిస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ ఈ సినిమాని రీరిలీజ్ చేస్తోంది.